Gold: మరోసారి రూ. లక్ష మార్కుకు బంగారం

by S Gopi |

గత కొన్ని వారాలుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు గురువారం ఒక్కరోజే రూ. 800కు పైగా పెరిగాయి.

Gold: మరోసారి రూ. లక్ష మార్కుకు బంగారం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బంగారం ధరలు మరొసారి రూ. లక్ష మార్కును చేరుకున్నాయి. గత కొన్ని వారాలుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు గురువారం ఒక్కరోజే రూ. 800కు పైగా పెరిగాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం రూ. 1,00,570 చేరుకుంది. హైదరాబాద్‌లో మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 99, 280 వద్ద ఉంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 800 పెరిగి రూ. 91,000కు చేరుకుంది. ప్రధానంగా మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు అంచనాల మధ్య పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడులకు ఎక్కువ ఆసక్తి చూపించారు. ఈ కారణంగా ధరలు ఊపందుకున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లలోనూ స్పాట్ గోల్డ్ 0.7 శాతం పెరిగి ఔన్సుకు 3,375.06 డాలర్లకు చేరుకుంది. అమెరికా డాలర్ బలహీనపడటం కూడా బంగారం డిమాండ్‌కు కారణమైంది. గురువారం డాలర్ ఇండెక్స్ రెండు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ముఖ్యంగా యూఎస్-ఇరాన్ సంబంధాలు, ఇజ్రాయెల్ సైనిక చర్యల కారణంగా నిరంతర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారానికి గిరాకీ పెరుగుతోంది. మరోవైపు సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కీలకమైన రిజర్వ్‌ ఆస్తిగా కొనుగోళ్లు కొనసాగిస్తున్నాయి. ఇది కూడా పసిడి ధరల పెరుగుదలకు దోహదపడుతున్నాయి.

Next Story