Gold Loans: భారీగా పెరిగిన బంగారు రుణాలు

by S Gopi |

అదే సమయంలో మైక్రోఫైనాన్స్ రుణాలు 16.5 శాతం తగ్గాయని చూపుతోంది.

Gold Loans: భారీగా పెరిగిన బంగారు రుణాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: సాధారణంగా చిన్న మొత్తం రుణాలపై ఆధారపడే తక్కువ ఆదాయ రుణగ్రహీతలు తక్షణ అవసరాల కోసం బంగారు రుణాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గణాంకాలు చెబుతున్నాయి. పెరుగుతున్న బంగారం ధరలు, ఇతర అన్-సెక్యూర్‌డ్ క్రెడిట్‌తో పోలిస్తే బంగారు రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు, కొత్త రుణాలను మంజూరు చేయడంలో మైక్రోఫైనాన్స్ సంస్థలు(ఎంఎఫ్ఐ) ఎక్కువ తనిఖీ వంటీ అంశాలు ఇందుకు కారణమయ్యాయి. ఆర్‌బీఐ తాజా డేటా ప్రకారం, ఈ ఏడాది జూన్ నాటికి బంగారంపై రుణాలు 122 శాతం పెరిగాయి. అయితే మైక్రోఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్‌వర్క్ నుంచి వచ్చిన డేటా అదే సమయంలో మైక్రోఫైనాన్స్ రుణాలు 16.5 శాతం తగ్గాయని చూపుతోంది. మైక్రోఫైనాన్స్ సంస్థల విషయంలో అమలవుతున్న కఠినమైన నిబంధనలు, అన్‌సెక్యూర్డ్ చిన్న రుణాల లభ్యత తగ్గడం వల్ల కూడా ప్రజలు బంగారం తాకట్టు పెట్టేందుకే చూస్తున్నారు. ముఖ్యంగా నెలవారీ ఆదాయం లేని, తక్కువ డాక్యుమెంటేషన్ ఉన్న గ్రామీణ ప్రాంతాలు, అసంఘటిత రంగాలలో ఉన్న వారి నుంచి బంగారు రుణాలకు అధిగ డిమాండ్ ఉంది.

ఆర్‌బీఐ డేటా ప్రకారం, 2025, జూలై నాటికి బంగారు ఆభరణాలపై ఉన్న రుణాల విలువ రూ. 2.94 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇదే సమయానికి అన్-సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ రుణాలు కేవలం 6 శాతం పెరిగి రూ. 2.91 లక్షల కోట్లకు చేరాయి. వ్యక్తిగత రుణాలు 8 శాతం పెరిగి రూ. 15.36 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఎంఎఫ్ఐల నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు రూ. 1.34 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇక, కొన్ని నెలలుగా ఊహించని స్థాయిలో రికార్డు వేగంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. 2025లో ఇప్పటివరకు బంగారం ధరలు 44.14 శాతం పెరిగాయి, ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి రూ. 1,13,800 వద్ద ఉంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 800 పెరిగి రూ. 1,02,600కి చేరింది.

Next Story