భారీగా పడిపోయిన పసిడి డిమాండ్.. 70 శాతం తగ్గిన కొనుగోళ్లు!

by Ramesh Naini |

భారతీయులకు బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు.. ఒక భద్రత, సురక్షితమైన పెట్టుబడి కూడా.. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా పసిడి కొనుగోళ్లపై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

భారీగా పడిపోయిన పసిడి డిమాండ్.. 70 శాతం తగ్గిన కొనుగోళ్లు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారతీయులకు బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు.. ఒక భద్రత, సురక్షితమైన పెట్టుబడి కూడా.. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా పసిడి కొనుగోళ్లపై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు, కేంద్ర ప్రభుత్వం పెంచిన దిగుమతి సుంకాల కారణంగా దేశవ్యాప్తంగా బంగారం డిమాండ్ ఏకంగా 70 శాతం మేర పడిపోయినట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

కొనుగోళ్లు ఎందుకు తగ్గాయంటే..

జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడుకునేందుకు కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు వాయిదా వేసుకోవాలని ప్రధాని మోడీ ఇటీవల ప్రజలకు పిలుపునిచ్చారు. దీనికి తోడు, కేంద్రం బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి భారీగా పెంచింది. దీంతో జీఎస్టీ తదితర పన్నులన్నీ కలుపుకుని పసిడిపై పన్ను భారం 9.18 శాతం నుంచి ఏకంగా 18.45 శాతానికి చేరింది. ఫలితంగా కొనుగోలుదారులు ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది.

భారీగా పడిపోయిన డిమాండ్..

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) అంచనాల ప్రకారం.. గత ఏడాది మే 27 నాటి పక్షం రోజుల్లో దాదాపు 25 టన్నులుగా ఉన్న డిమాండ్, ఈ ఏడాది అదే సమయానికి కేవలం 7.5 టన్నులకు పడిపోయింది. దేశీయంగా 65 శాతం వాటా కలిగిన అసంఘటిత రంగంపై ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోందని ఐబీజేఏ వెల్లడించింది. ఇరాన్ ఉద్రిక్తతల పరిణామాలతో పెరిగిన ఇంధన, ఆహార ధరల వల్ల సామాన్యులపై ఆర్థిక భారం పడింది. దీనికి తోడు ప్రస్తుత నెల ‘అధిక మాసం’ కావడం, పెట్టుబడిదారుల్లో ఆసక్తి తగ్గడం కూడా పసిడి విక్రయాలు మందగించడానికి ప్రధాన కారణాలుగా పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాగా, సెంటిమెంట్ ఎలా ఉన్నప్పటికీ.. పెరిగిన ధరలు, పన్నుల భారం దృష్ట్యా ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో చాలా కుటుంబాలు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Next Story