FPIs: రూ.2 లక్షల కోట్లు దాటిన ఎఫ్‌పీఐ అమ్మకాలు

by S Gopi |

ఈ నెలలో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు రూ.14,231 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించినట్లు డిపాజిటరీ గణాంకాలు వెల్లడించాయి.

FPIs: రూ.2 లక్షల కోట్లు దాటిన ఎఫ్‌పీఐ అమ్మకాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారతీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు రూ.14,231 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించినట్లు డిపాజిటరీ గణాంకాలు వెల్లడించాయి. దీంతో 2026లో ఇప్పటివరకు భారత ఈక్విటీ మార్కెట్ నుంచి మొత్తం ఎఫ్‌పీఐల విక్రయాలు రూ.2 లక్షల కోట్లను దాటాయి. ఇది గతేడాది నమోదైన ఔట్‌ఫ్లో కంటే కూడా ఎక్కువ కావడం మార్కెట్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఫిబ్రవరి మినహా ఈ ఏడాది దాదాపు ప్రతి నెలా విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలను కొనసాగిస్తున్నారు. మార్కెట్ నిపుణుల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ముడి చమురు ధరల పెరుగుదల, అమెరికా వడ్డీ రేట్ల భవిష్యత్తుపై అనిశ్చితి కారణంగా అభివృద్ధి చెందిన దేశాల బాండ్ మార్కెట్లవైపు పెట్టుబడులు మళ్లుతున్నాయి. దీంతో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడులపై రిస్క్ తీసుకునే ధోరణి తగ్గుతోంది. అదనంగా భారత కరెన్సీ రూపాయిపై ఒత్తిడి కూడా విదేశీ ఇన్వెస్టర్ల డాలర్ రాబడులను ప్రభావితం చేస్తోంది. ఇది కూడా భారత మార్కెట్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు కారణమని నిపుణులు పేర్కొన్నారు.

Next Story