Global Debt: అప్పుల ఊబిలో ప్రపంచం

by S Gopi |

2025 నాటికే ప్రపంచ రుణం జీడీపీలో సుమారు 94 శాతానికి చేరింది. నిరంతర లోటు, పెరిగిన వడ్డీ ఖర్చులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దీనికి ప్రధాన కారణాలని ఐఎంఎఫ్ పేర్కొంది.

Global Debt: అప్పుల ఊబిలో ప్రపంచం
X

దిశ, బిజినెస్ బ్యూరో: అభివృద్ధి చెందిన, చెందుతున్న ఆర్థికవ్యవస్థలలో ద్రవ్యపరమైన ఒత్తిళ్లు తీవ్రమవుతున్నందున, ప్రపంచ దేశాల అప్పులు ఆందోళనకర స్థాయికి పెరగనున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) హెచ్చరించింది. 2029 నాటికి ఇది ప్రపంచ జీడీపీలో 100 శాతానికి చేరవచ్చని అంచనా చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితులు క్రమంగా క్షీణిస్తున్నాయి. 2025 నాటికే ప్రపంచ రుణం జీడీపీలో సుమారు 94 శాతానికి చేరింది. నిరంతర లోటు, పెరిగిన వడ్డీ ఖర్చులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దీనికి ప్రధాన కారణాలని ఐఎంఎఫ్ పేర్కొంది. అవి ఇంకా పెరుగుతూనే ఉంటాయని అంచనా. ఇటీవలి పశ్చిమాసియా ఘర్షణలు, భౌగోళిక సమస్యలు ఇంధన ధరలను పెంచి ప్రపంచ ఆర్థిక పరిస్థితులను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహార, ఇంధన ధరలు కూడా పెరుగుతున్నాయి. ఈ ప్రభావం ముఖ్యంగా దిగుమతి ఆధారిత, తక్కువ ఆదాయ దేశాలపై ఎక్కువగా పడుతోంది. తద్వారా ఈ దేశాలు అధిక ఖర్చులు, పరిమిత ఆర్థిక వెసులుబాటు సమస్యలను ఎదుర్కొంటున్నాయి.

మనమే బెటర్

అయితే, ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్‌తో పాటు మెక్సికో, టర్కీ వంటి దేశాలు కొంత మెరుగైన ఆర్థిక స్థితిలో ఉన్నాయి. భారత్‌లో ఖర్చుల నియంత్రణ సరిగ్గానే ఉందని, అత్యంత పటిష్టమైన వృద్ధి ఇందుకు కారణమని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. భారత రుణ-జీడీపీ నిష్పత్తి ఇంకా 84 శాతం కంటే ఎక్కువగా ఉంది. మనదేశం తర్వాత మధ్యస్థంగా అప్పుల భారం ఉన్న దేశాల్లో బ్రెజిల్(90 శాతం), చైనా(100 శాతం), యూకే(105 శాతం), కెనడా(105 శాతం), స్పెయిన్(110 శాతం) ఉన్నాయి. అంతర్జాతీయ సంక్షోభాలు కొనసాగితే ఇంధన ధరలు, నిధులు, ఆర్థిక నిర్వహణపై ఒత్తిడి పెరుగుతుందని ఐఎంఎఫ్ హెచ్చరించింది.

గత దశాబ్దంతో పోలిస్తే అదనంగా డబ్బు ఖర్చు చేయడానికి లేదా అప్పు తీసుకోవడానికి ఉన్న సామర్థ్యం ప్రపంచ దేశాల్లో చాలా తగ్గిపోయింది. ప్రస్తుతం చాలా దేశాలు అధిక వడ్డీ రేట్లతో రుణాలు తీసుకోవాల్సి వస్తోంది, దీంతో వడ్డీ భారం వేగంగా పెరుగుతోంది. జపాన్(జీడీపీలో 240 శాతం అప్పుల భారం), సింగపూర్(180 శాతం), గ్రీస్(170 శాతం), ఇటలీ(145 శాతం), అమెరికా(125 శాతం) దేశాలు భారీ అప్పులను ఎదుర్కొంటున్నాయి. రష్యా, సౌదీ అరేబియా, యూఏఈ, ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్స్ దేశాలు 20-65 శాతం మధ్య తక్కువ రుణాలు కలిగి ఉన్నాయి.

Next Story