India Inc: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో నియామకాలు ఆపేసే ఆలోచనలో కంపెనీలు

by S Gopi |

36 శాతం మంది మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్రమైతే తమ జీతం పెంపు, బోనస్‌లపై ప్రభావం తప్పదని భావిస్తున్నారు.

India Inc: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో నియామకాలు ఆపేసే ఆలోచనలో కంపెనీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు ముదురుతున్న కొద్దీ వాటి ప్రభావం క్రమంగా కనిపిస్తోంది. తాజాగా ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల భారతీయ కంపెనీలు కొత్తగా చేపట్టే నియామకాల విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నాయి. దేశీయంగా 63 శాతం కంపెనీలు నియామకాలకు నిలిపేయడమే కాకుండా ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నాయని కొందరు ఉద్యోగులు స్పష్టం చేసినట్టు ఓ నివేదిక తెలిపింది. ప్రముఖ స్టాఫింగ్ సొల్యూషన్స్, హెచ్ఆర్ సర్వీసెస్ ప్రొవైడర్ జీనియస్ కన్సల్టెంట్ ప్రకారం, 63 శాతం కంటే ఎక్కువమంది ఉద్యోగులు తాము పనిచేస్తున్న కంపెనీలు నియామకాలను ఆపే దిశగా ఆలోచిస్తున్నాయని చెప్పారు. మరో 15 శాతం మంది భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగితే తమ కంపెనీల్లోని కాంట్రాక్ట్ ఆధారిత ఉద్యోగులతో పాటు ఫ్రీలాన్స్ విభాగంలో పనిచేసే వారిని తగ్గించే యోచనలో ఉన్నట్టు చెప్పారు. అదేవిధంగా 36 శాతం మంది మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్రమైతే తమ జీతం పెంపు, బోనస్‌లపై ప్రభావం తప్పదని భావిస్తున్నారు. 21 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పని భారం పెరుగుతుందని, ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు. 22 శాతం మంది అంతర్జాతీయ వ్యాపారంలో సమస్యలు తలెత్తుతాయని, 21 శాతం మంది ఉద్యోగుల విశ్వాసం సన్నగిల్లుతుందని వెల్లడించారు. ప్రతికూల పరిస్థితుల వల్ల తమ ఉద్యోగం పోకుండా ఉండేందుకు 55 శాతం మంది స్కిల్స్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తుండగా, కొత్త కోర్సులు కూడా చేస్తున్నారు. 31 శాతం మంది కొత్త ఉద్యోగాలను వెతకడం ప్రారంభించారని నివేదిక వెల్లడించింది.

Next Story