GJEPC: 16 శాతం తగ్గిన రత్నాభరణాల ఎగుమతులు

by S Gopi |

ఇదే నెలలో మన దేశంలోకి రూ. 14,393.12 కోట్ల విలువైన రత్నాభరణాలు దిగుమతి అయ్యాయి.

GJEPC: 16 శాతం తగ్గిన రత్నాభరణాల ఎగుమతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: మనదేశం నుంచి రత్నాభరణాల ఎగుమతులు ఈ ఏడాది మే నెలలో 2,263.42 మిలియన్‌ డాలర్ల (రూ.19,260.81 కోట్ల)కు పరిమితమయ్యాయని రత్నాభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) మంగళవారం ప్రకటనలో వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో ఎగుమతులు 2688.38 మిలియన్లు (రూ. 22414.02 కోట్లు)తో పోలిస్తే 15.81 శాతం క్షీణించాయి. ఇదే నెలలో మన దేశంలోకి రూ. 14,393.12 కోట్ల విలువైన రత్నాభరణాలు దిగుమతి అయ్యాయి. గతేడాది ఇదే నెలలో వచ్చిన రూ. 16,184.80 కోట్ల కంటే 12.96 శాతం తగ్గాయి. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్ కారణంగా అంతర్జాతీయ వాణిజ్యంలో నెలకొన్న అనిశ్చితి వల్ల డిమాండ్ బలహీనపడిందని, దీనికి తోడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరింత ఒత్తిడిని పెంచాయని జీజేఈపీసీ అభిప్రాయపడింది. సమీక్షించిన నెలలో కట్ అండ్ పాలిష్ వజ్రాల ఎగుమతులు 35.49 శాతం పడిపోయాయి. ప్రధాన మార్కెట్లు అయిన అమెరికా, చైనాలలో డిమాండ్ తగ్గడంతో వీటి ఎగుమతుల విలువ రూ. 12,272 కోట్ల నుంచి రూ. 8,089.81 కోట్లకు తగ్గాయి. ఇదే నెలలో కట్ అండ్ పాలిష్ చేసిన వజ్రాల దిగుమతులు 38.76 శాతం పడిపోయాయి. ముడి వజ్రాల దిగుమతులు 5.46 శాతం తక్కువగా రూ. 19,949.36 కోట్ల విలువైన దిగుమతులు జరిగాయి. అమెరికా, చైనామ మార్కెట్ల ప్రభావంతో పాటు ధరలు తగ్గిపోవడం, సరఫరా దెబ్బతినడం వంటి అంశాలు వ్యాపారులకు ఇబ్బందిగా పరిణమించాయి.

బంగారానికి డిమాండ్

మే నెలలో బంగారం ఆభరణాలకు సంబంధించి 17.24 శాతం అధికంగా రూ. 8,482.08 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. గతేడాది ఇదే నెలలో రూ. 7,094.52 కోట్ల విలువైన ఎగుమతులు నమోదయ్యాయి. బంగారాన్ని పెట్టుబడిగానే కాకుండా రోజూ వాడేందుకు ఎక్కువ మంది ఇష్టపడటమే ఇందుకు కారణమని జీజేఈపీసీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా బంగారు ఆభరణాలకు గిరాకీ పెరుగుతోంది. ట్రంప్ టారిఫ్ ప్రకటన ఎగుమతులు తగ్గేందుకు ప్రధాన కారణమని కామా జ్యువెలరీ ఎండీ కాలిన్ షా చెప్పారు. దీనికి తోడు మధ్యప్రాచ్యం, రష్యా-ఉక్రెయిన్‌లో నెలకొన్న ఉద్రిక్తతలు డిమాండ్-సరఫరాను తీవ్రంగా అంతరాయం కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

Next Story