- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gameskraft: రియల్-మనీ గేమింగ్ నిషేధంతో ఉద్యోగులను తొలగించిన గేమ్స్‌క్రాఫ్ట్
రియల్ మనీ గేమింగ్‌ను నిషేధించడంతో తమ కంపెనీ సేవలు పూర్తిస్థాయిలో ఆగిపోయాయని పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025 ఆమోదం నేపథ్యంలో దేశంలోని గేమింగ్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. రియల్ మనీ గేమింగ్‌పై పూర్తి నిషేధం కారణంగా ఈ రంగంలో కార్యకలాపాల నిర్వహణ, కొనసాగింపు కష్టంగా మారిందని కంపెనీలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఆన్‌లైన్ గేమింగ్ సంస్థ గేమ్‌స్క్రాఫ్ట్ నష్టాలను తగ్గించుకోవడం, కంపెనీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 120 మంది ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నామని గురువారం ప్రకటించింది. రియల్ మనీ గేమింగ్‌ను నిషేధించడంతో తమ కంపెనీ సేవలు పూర్తిస్థాయిలో ఆగిపోయాయని పేర్కొంది. వ్యవస్థీకృత మార్పులను చేపట్టడం తప్పించి తమకు మరో మార్గం లేదు. తొలగింపుల్లో భాగంగా ఫంక్షన్స్, టీమ్స్ విభాగాల్లో ఉన్నవారికి ఉద్వాసన పలికామని, వారందరికీ సంస్థ ఒప్పందం ఆధారంగా చెల్లింపులు, ప్రయోజనాలు అందిస్తామని వివరించింది. వచ్చే ఏడాది మార్చి వరకు లేదా కొత్త ఉద్యోగంలో చేరేవరకు వారికి ఆరోగ్య బీమా కొనసాగుతుంది. గ్రూప్ ప్లాన్‌ను వ్యక్తిగత బీమా పాలసీగా మార్చుకునే సదుపాయం కూడా కల్పిస్తామని, డిపెండెంట్ పేరెంట్ కవరేజ్ ఉన్నవారు దానిని కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. కాగా, కొత్త గేమింగ్ బిల్లు కారణంగా రియల్-మనీ గేమింగ్ వ్యాపారంలో ఉన్న అనేక కంపెనీలు రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మందిని తొలగించడానికి సిద్ధంగా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.






