EV Sales: వాహన రంగంలో రికార్డు స్థాయికి చేరిన ఈవీలు

by S Gopi |

అన్ని విభాగాల్లో కలిపి 3,06,220 ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయమవగా, ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక నెలవారీ అమ్మకాలు కావడం గమనార్హం.

EV Sales: వాహన రంగంలో రికార్డు స్థాయికి చేరిన ఈవీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇంధన ధరల పెరుగుదల, పర్యావరణహిత వాహనాలపై పెరుగుతున్న ఆసక్తితో భారత వాహన మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) తాజా గణాంకాల ప్రకారం, జూన్‌లో మొత్తం ఆటో రిటైల్ అమ్మకాల్లో ఈవీల వాటా రికార్డు స్థాయిలో 12.5 శాతానికి చేరింది. అన్ని విభాగాల్లో కలిపి 3,06,220 ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయమవగా, ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక నెలవారీ అమ్మకాలు కావడం గమనార్హం. ప్యాసింజర్ వాహనాల్లో ఈవీల వాటా 8 శాతం పెరిగి 31,823 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ వాటా తొలిసారిగా 10.6 శాతానికి చేరగా, త్రీ-వీలర్ విభాగంలో ఇప్పటికే 64 శాతం అమ్మకాలు ఈవీలే ఉన్నాయి. కమర్షియల్ వాహనాల్లో కూడా ఈవీల వాటా 4 శాతానికి చేరడం మార్కెట్‌లో విద్యుదీకరణ వేగంగా జరుగుతోందని సూచిస్తోంది. మరోవైపు సీఎన్‌జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు కలిపి తొలిసారిగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో 40 శాతానికి పైగా వాటా సాధించాయి.

మొత్తం ఆటో మార్కెట్ కూడా జూన్‌లో మెరుగైన అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. మొత్తం రిటైల్ అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 21.8 శాతం పెరిగి 25.6 లక్షల యూనిట్లకు చేరగా, అన్ని ప్రధాన విభాగాల్లో అమ్మకాల రికార్డులను నమోదు చేశాయి. ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 28.6 శాతం పెరిగి 4.11 లక్షల యూనిట్లకు, ద్విచక్ర వాహనాలు 21.2 శాతం వృద్ధితో 18.3 లక్షల యూనిట్లకు, త్రీ-వీలర్లు 1.21 లక్షల యూనిట్లకు, కమర్షియల్ వాహనాలు 90,972 యూనిట్లకు చేరాయి. ఖరీఫ్ సీజన్‌కు ముందు రైతుల కొనుగోళ్లు పెరగడంతో ట్రాక్టర్ అమ్మకాలు కూడా 25.3 శాతం వృద్ధితో 1.01 లక్షల యూనిట్లు నమోదు చేశాయి.

Next Story