Tariff: ట్రంప్ డబుల్ టారిఫ్ ప్రభావం ఎలా ఉండనుంది?

by S Gopi |

ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన టారిఫ్ కారణంగా ఆర్డర్‌లు ఆగిపోయాయని, ఇతర ఆసియా దేశాల ఎగుమతిదారులకు మళ్లాయని చెబుతున్నాయి.

Tariff: ట్రంప్ డబుల్ టారిఫ్ ప్రభావం ఎలా ఉండనుంది?
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్, అమెరికా మధ్య వాణిజ్య వివాదం తీవ్రమవుతోంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 25 శాతం సుంకాలను విధిస్తుండగా, దీనికి అదనంగా రష్యా చమురు కొంటున్నందుకు మరో 25 శాతం టారిఫ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో భారత ఉత్పత్తులపై మొత్తం సుంకం 50 శాతం చేరుతుంది. ఇది బుధవారం(ఆగష్టు 27) నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో అనేక రకాల భారతీయ వ్యాపారాలపై 50 శాతం సుంకం తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే భారత్‌కు అమెరికా అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌గా కొనసాగుతోంది. అమెరికా దాదాపు ఐదో వంతు ఎగుమతుల వాటా ఉండటంతో 50 శాతం సుంకం కారణంగా వియత్నాం, బంగ్లాదేశ్, మెక్సికో వంటి దేశాల నుంచి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా భారత్‌పై అదనపు టారిఫ్ విధించింది. ఈ ఆంక్షలతో భారత్ డిస్కౌంట్‌లో కొంటున్న రష్యా చమురు దిగుమతులు బలహీనపడతాయని ట్రంప్ ప్రభుత్వం ఆశిస్తోంది. భారత్ తన చమురు కొనుగోళ్లను తగ్గించుకోవడానికి ఒత్తిడి చేసేలా టారిఫ్ నిర్ణయం ఉపయోగపడుతుందని వైట్‌హౌస్ వర్గాలు భావిస్తున్నాయి.

ట్రంప్ సుంకాలతో దెబ్బతిన్న రంగాలు

ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన టారిఫ్ కారణంగా టెక్స్‌టైల్స్, ఫ్యాషన్ రంగంలో ఆర్డర్‌లు ఆగిపోయాయని, బదులుగా ఇతర ఆసియా దేశాల ఎగుమతిదారులకు మళ్లాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, ఏటా 9.2 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు నిర్వహించే రత్నాభరణాల పరిశ్రమలోనూ సరఫరా ఆగిపోయింది. ఇది ఈ రంగంలోని ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతుంది. అధిక ఖర్చుల కారణంగా ఆటో విడిభాగాలు, మెడిసిన్, ఎలక్ట్రానిక్స్ రంగాలు మార్జిన్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఉత్పత్తిలో సగానికి పైగా అమెరికాకు పంపే రొయ్యల ఎగుమతిదారులు అధిక సుంకాలు అమలైతే తీవ్ర నష్టాలు తప్పవని, ఆర్డర్లు రద్దవుతాయని భయపడుతున్నారు.

2023-24లో భారత్ 86.5 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను అమెరికాకు ఎగుమతి చేసింది. ఇది దేశ మొత్తం వస్తువుల ఎగుమతుల్లో 20 శాతానికి సమానం.

తర్వాత ఏం జరుగుతుంది?

అధిక సుంకాలతో ఇంజనీరింగ్ వస్తువులు, లెదర్, వినియోగ వస్తువుల ఎగుమతులు ఎక్కువ దెబ్బతింటాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు, ఇవన్నీ అమెరికా మార్కెట్‌పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. థింక్ ట్యాంక్ జీటీఆర్ఐ అంచనాల ప్రకారం, అమెరికాకు భారత్ చేసే ఎగుమతులు 40-50 శాతం తగ్గవచ్చు, దీనివల్ల విదేశీ మారక ద్రవ్య ఆదాయం తగ్గుతుంది.

భారతదేశ ఆర్థిక వృద్ధిపై ప్రభావం

వచ్చే ఏడాదిలో కొత్త అమెరికా సుంకాల వల్ల భారత ఆర్థికవ్యవస్థ మందగించవచ్చని ఆర్థికవేత్తలు అంటున్నారు. సుంకాలు కొనసాగితే, 2025-26లో వృద్ధి అంచనా కంటే 0.2-0.4 శాతం తక్కువగా నమోదు కావొచ్చు. రష్యా చమురు, రక్షణ ఒప్పందాలకు సంబంధించి అధిక టారిఫ్ వల్ల పెట్టుబడులు కూడా తగ్గుతాయని, తద్వారా వృద్ధి మందగమనాన్ని ఇది మరింత దెబ్బతీయవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

భారత్ వైఖరి

అమెరికా అధిక సుంకాలపై ఇదివరకే విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇది అన్యాయం, అసమంజసమైనదని అభివర్ణించింది. ఇంతకు మించి, మరొ అధికారిక ప్రతిఘటన చర్యలను ప్రభుత్వం ప్రకటించలేదు. అయితే ప్రభుత్వం రైతులు, చిన్న ఎగుమతిదారులను కాపాడుతుందని స్పష్టం చేస్తోంది. చమురు దిగుమతులు వాణిజ్యపరమైన నిర్ణయాలు తప్ప రాజకీయమైనవి కాదని అధికారులు పేర్కొంటున్నారు.

Next Story