FPIs: ఒక్క వారంలోనే రూ. 43 వేల కోట్ల విదేశీ నిధుల ఉపసంహరణ

by S Gopi |

బలహీన కార్పొరేట్ ఆదాయ వృద్ధి, రూపాయి విలువ క్షీణించడం, అలాగే అమెరికా మార్కెట్లలో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల్లో భారీ పెట్టుబడి అవకాశాలు కనిపించడం విదేశీ నిధులు వెనక్కి వెళ్లిపోవడానికి ప్రధాన కారణాలుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి

FPIs: ఒక్క వారంలోనే రూ. 43 వేల కోట్ల విదేశీ నిధుల ఉపసంహరణ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడిదారుల నిధుల ఉపసంహరణ మరింత వేగం పుంజుకుంది. జూన్ నెల తొలి వారంలోనే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 43,000 కోట్లు వెనక్కి తీసుకోగా, ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం ఉపసంహరణలు రూ. 2.67 లక్షల కోట్లకు చేరాయి. ఇది గత ఏడాది మొత్తం నమోదైన రూ. 1.66 లక్షల కోట్ల అవుట్‌ఫ్లోను ఇప్పటికే దాటేసింది. బలహీన కార్పొరేట్ ఆదాయ వృద్ధి, రూపాయి విలువ క్షీణించడం, అలాగే అమెరికా మార్కెట్లలో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల్లో భారీ పెట్టుబడి అవకాశాలు కనిపించడం విదేశీ నిధులు వెనక్కి వెళ్లిపోవడానికి ప్రధాన కారణాలుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకించి ఏఐ ఆధారిత కంపెనీలు, రాబోయే భారీ టెక్నాలజీ ఐపీఓలు ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీంతో భారత్‌తో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి కూడా నిధులు అభివృద్ధి చెందిన మార్కెట్ల వైపు మళ్లుతున్నాయి. మరోవైపు, ఈ ఏడాది రూపాయి డాలర్‌తో పోలిస్తే దాదాపు 6 శాతం బలహీనపడటం కూడా విదేశీ ఇన్వెస్టర్ల ఆందోళనను పెంచింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ పలు చర్యలు ప్రకటించాయి. విదేశీ పెట్టుబడులపై పన్ను రాయితీలు, ఎఫ్‌సీఎన్ఆర్ డిపాజిట్లకు మద్దతు, ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి అవకాశాల విస్తరణ వంటి చర్యలు చేపట్టాయి. అయితే ఏఐ ఆధారిత గ్లోబల్ పెట్టుబడి జోరు తగ్గితేనే భారత మార్కెట్లోకి విదేశీ నిధుల ప్రవాహం మళ్లీ బలపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Next Story