Foxconn: ఫాక్స్‌కాన్ కొత్త ఐఫోన్ ప్లాంట్‌లో 30 వేల ఉద్యోగాలు.. 80 శాతం మహిళలే

by S Gopi |

ఈ ప్లాంట్ దేశంలోనే ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్న చోటుగా మారింది.

Foxconn: ఫాక్స్‌కాన్ కొత్త ఐఫోన్ ప్లాంట్‌లో 30 వేల ఉద్యోగాలు.. 80 శాతం మహిళలే
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇఫోన్ తయారీ కాంట్రాక్ట్ కంపెనీ ఫాక్స్‌కాన్ భారత్‌లో వేగంగా విస్తరణ పనులు చేపడుతోంది. తాజాగా కర్ణాటకలోని కొత్త ఫాక్స్‌కాన్ తయారీ యూనిట్ కోసం పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టినట్టు తెలుస్తోంది. గడిచిన 8-9 నెలల్లో కంపెనీ ఏకంగా 30,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్టు జాతీయ మీడియా కథనం పేర్కొంది. ఈ నియామకాల్లోనూ అత్యధికం మహిళలే ఉండటం గమనార్హం. దేశంలోని మరే తయారీ కంపెనీ కూడా ఇంత తక్కువ సమయంలో భారీ నియామకాలు చేపట్టలేదు. బెంగళూరుకు సమీపంలోని దేవనహళ్లిలో ఏర్పాటైన ఫాక్స్‌కాన్ రెండో అతిపెద్ద ఐఫోన్ తయారీ యూనిట్ 300 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రపంచ సరఫరాకు తోడు చైనాకు వెలుపల ఉత్పత్తిని మెరుగుపరిచే యాపిల్ లక్ష్యంలో భాగంగా ఈ అభివృద్ధి జరిగింది. ఈ ప్లాంటులో ఫాక్స్‌కాన్ మొదట ఐఫోన్ 16 మోడళ్లను తయారు చేయగా, ఇటీవల ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ల తయారీని ప్రారంభించింది.

మహిళా శ్రామిక శక్తి

ఈ భారీ నియామక డ్రైవ్‌లో దాదాపు 80 శాతం మంది ఉద్యోగులు మహిళలు ఉన్నారని, ఎక్కువగా 19–24 ఏళ్ల వయస్సు గలవారు, మొదటిసారిగా అధికారికంగా ఉద్యోగంలోకి అడుగుపెట్టిన వారు ఉండటం విశేషం. వీరిలో చాలామంది పొరుగు రాష్ట్రాల నుంచి అవకాశం కోసం వలస వచ్చినవారున్నారు. ఈ ప్లాంట్ దేశంలోనే ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్న చోటుగా మారింది. ఈ స్థాయి మహిళల నియామకం దేశ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో జెండర్ డైవర్సిటీని మెరుగుపరచడానికి చేస్తున్న ప్రయత్నాల్లో కీలకమైన అడుగుగా ఉంటుందని కంపెనీ భావిస్తోంది. 2026 నాటికి ఇక్కడ 50 వేలకు పైగా సిబ్బందిని నియమిస్తామని ఫాక్స్‌కాన్ స్పష్టం చేసింది. వారికోసం అన్ని సౌకర్యాలు, ఇళ్లు, వైద్యం, విద్య వంటి సదుపాయాలు కల్పిస్తామని పేర్కొంది.

Next Story