TCS Employee: ఫుట్‌పాత్‌పై పడుకున్న టీసీఎస్ ఉద్యోగి.. స్పందించిన కంపెనీ

by S Gopi |

అందుకే తాను ఫుట్‌పాత్‌పైనే పడుకుంటున్నాను' అని లేఖలో వివరణ ఇచ్చాడు.

TCS Employee: ఫుట్‌పాత్‌పై పడుకున్న టీసీఎస్ ఉద్యోగి.. స్పందించిన కంపెనీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం ఐటీ రంగంలో ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని ఆందోళనతో కొందరు బిక్కుబిక్కుమంటుంటే, మరికొంతమంది జీతాలు రాక ఇబ్బందిపడుతున్నారు. తాజాగా పూణేలోని ఓ టీసీఎస్ ఉద్యోగి ఇలాంటి దుస్థితినే ఎదుర్కోవాల్సి వచ్చింది. సౌరభ్ మోరె అనే ఉద్యోగి పెండింగ్‌లో ఉన్న తన జీతం జమ చేయాలని డిమాండ్ చేస్తూ కంపెనీ బయట ఫుట్‌పాత్‌పై నిరసనకు దిగాడు. జీతం రాక తినడానికి కూడా డబ్బు లేదని పేర్కొంటూ అతను ఓ లేఖను పక్కనే పెట్టుకున్నాడు. 'తన ఆర్థిక పరిస్థితి గురించి జూలై 29న టీసీఎస్ సహ్యాద్రి పార్క్ ఆఫీసులో వివరించాను. తన ఐడీ టీసీఎస్ సిస్టమ్స్‌లో యాక్టివ్‌గా లేదని కూడా తెలియజేశాను. తనకు జీతం అందలేదనే విషయాన్ని జూలై 30 జరిగిన సమావేశంలోనూ చెప్పాను. జీతం రాకపోతే బయటే పడుకోవాల్సి వస్తుందని కంపెనీ హెచ్ఆర్‌కు స్పష్టం చేశాను. అయినప్పటికీ స్పందన లేదు. అందుకే తాను ఫుట్‌పాత్‌పైనే పడుకుంటున్నాను' అని లేఖలో వివరణ ఇచ్చాడు. జీతం రావడంలో ఆలస్యానికి నిరసనగా సదరు ఉద్యోగి బయట నిద్రిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై స్పందించిన ఇటీ ఉద్యోగుల కోసం ఫోరం (ఎఫ్ఐటీఈ).. పెండింగ్ జీతం కోసం పూణే కార్యాలయం బయట నిరసన తెలుపుతున్న టీసీఎస్ ఉద్యోగికి సంఘీభావం తెలుపుతున్నాం. ఇంత దారుణమైన పరిస్థితుల్లో తన నిరసనను వినిపించిన ఉద్యోగి ధైర్యం ప్రశంసనీయమని పేర్కొంది. దీనిపై కార్మిక మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని కోరారు.

స్పందించిన టీసీఎస్

ఈ ఘటనపై ఐటీ సేవల సంస్థ టీసీఎస్ స్పందించింది. సదరు ఉద్యోగి గురించి వివరాలు తెలుసుకున్నాం. అయితే, ఆ ఉద్యోగి ఆఫీసుకు సమాచారం లేకుండా గైర్హాజరు కావడం వల్ల జీతం నిలిపేసినట్టు స్పష్టం చేసింది. స్టాండర్డ్ ప్రొసీజర్ ప్రకారం, సమీక్షించిన సమయంలో ఉద్యోగి ఆఫీసుకు వెళ్లని కాలానికి సంబంధించిన జీతం ఆగిందని వెల్లడించింది. ప్రస్తుతం అతనికి వసతి కల్పించాం. ఈ అంశాన్ని న్యాయమైన, సరైన పద్దతిలో పరిష్కరించేలా చూస్తున్నామని పేర్కొంది.

Next Story