- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Forbs: ప్రపంచ సంపన్నుల జాబితాలో 28వ స్థానానికి పడిపోయిన అదానీ
దేశంలో ప్రస్తుతం 205 మంది బిలియనీర్లు ఉన్నారు. అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది.

దిశ, బిజినెస్ బ్యూరో: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి భారత అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఈ మేరకు బుధవారం ఫోర్బ్స్ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. గతేడాది నాటికి 116 బిలియన్ డాలర్ల(రూ. 9.91 లక్షల కోట్ల) సంపదను కలిగిన ఆయన, ఈ ఏడాది 92.5 బిలియన్ డాలర్ల(రూ. 7.90 లక్షల కోట్ల)కు తగ్గినప్పటికీ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో దేశీయ మరో బిలియనీర్, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ గతేడాది కంటే గణనీయంగా దిగజారారు. 2024 నాటి జాబితాలో 84 బిలియన్ డాలర్ల(రూ. 7.17 లక్షల కోట్ల)తో 17వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది పదికి పైగా స్థానాలు కోల్పోయి 28వ ర్యాంకుకు చేరారు. ఫోర్బ్స్ డేటా ప్రకారం, దేశంలో ప్రస్తుతం 205 మంది బిలియనీర్లు ఉన్నారు. అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. గతేడాది మన దేశంలో మొత్తం 200 మందిగా ఉన్న బిలియనీర్ల సంఖ్య స్వల్పంగా పెరిగింది. వీరందరి సంయుక్త సంపద విలువ 941 బిలియన్ డాలర్లు(రూ. 80.4 లక్షల కోట్లు) ఉంటుందని ఫోర్బ్స్ తెలిపింది. గతేడాది 954 బిలియన్ డాలర్లు(రూ. 81.50 లక్షల కోట్ల) నుంచి తగ్గింది. దేశంలోనే ఇద్దరు అత్యంత ధనవంతుల సంపద 20 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా క్షీణించడం, వారి కంపెనీల షేర్లలో పతనం ఇందుకు ప్రధాన కారణం.
ముఖేష్ అంబానీ ఫోర్బ్స్ జాబితాలో అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మాత్రం ఆయన తొమ్మిది నుంచి 18వ స్థానానికి చేరారు. అంబానీ తర్వాత 56.3 బిలియన్ డాలర్ల(రూ. 4.81 లక్షల కోట్ల)తో దేశీయ రెండో అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ ఉన్నారు. ప్రపంచ జాబితాలో మాత్రం 28వ స్థానానికి పడిపోయారు. గౌతమ్ అదానీ టిక్‌టాక్‌కు చెందిన జాంగ్ యిమింగ్ (23వ ర్యాంక్, 65.5 బిలియన్ డాలర్లు), నాంగ్‌ఫు స్ప్రింగ్‌కి చెందిన జాంగ్ షన్షాన్ (26వ ర్యాంక్, 57.7 బిలియన్ డాలర్లు) తర్వాత ఆసియాలో నాలుగవ అత్యంత సంపన్నుడిగా ఉన్నారు.
టాప్-10 సంపన్న భారతీయులు
ముఖేష్ అంబానీ (నికర విలువ 92.5 బిలియన్ డాలరు- రూ. 7.90 లక్షల కోట్లు)
గౌతమ్ అదానీ (నికర విలువ 56.3 బిలియన్ డాలరు- రూ. 4.81 లక్షల కోట్లు)
సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ (నికర విలువ 35.5 బిలియన్ డాలరు- రూ. 3.03 లక్షల కోట్లు)
శివ్ నాడార్ (నికర విలువ 34.5 బిలియన్ డాలరు- రూ. 2.94 లక్షల కోట్లు)
దిలీప్ షాంఘ్వీ (నికర విలువ 24.9 బిలియన్ డాలరు- రూ. 2.12 లక్షల కోట్లు)
సైరస్ పూనావాలా (నికర విలువ 23.1 బిలియన్ డాలరు- రూ. 1.97 లక్షల కోట్లు)
కుమార్ మంగళం బిర్లా (నికర విలువ 20.9 బిలియన్ డాలరు- రూ. 1.78 లక్షల కోట్లు)
లక్ష్మీ మిట్టల్ (నికర విలువ 19.2 బిలియన్ డాలరు- రూ. 1.64 లక్షల కోట్లు)
రాధాకిషన్ దమానీ (నికర విలువ 15.4 బిలియన్ డాలరు- రూ. 1.31 లక్షల కోట్లు)
కుశాల్ పాల్ సింగ్ (నికర విలువ 14.5 బిలియన్ డాలరు- రూ. 1.23 లక్షల కోట్లు)
ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్లు రికార్డు స్థాయిలో 3,028 మంది ఉన్నారు. బిలియనీర్ సంఖ్య 3,000 మార్కును దాటడం ఇదే మొదటిసారి. వీరందరి సంయుక్త సంపద విలువ రికార్డు స్థాయిలో 16.1 ట్రిలియన్ డాలర్లు(రూ. 1,375.26 లక్షల కోట్లు)గా ఉంది. ఈ సంపద విలువ 2024 కంటే 2 ట్రిలియన్ డాలర్లు పెరిగిందని ఫోర్బ్స్ తెలిపింది. అత్యధికంగా అమెరికా 902 మంది బిలియనీర్లతో ర్యాంకింగ్స్‌లో ఆధిపత్యం చెలాయించగా, చైనా (516), భారతదేశం (205) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ 342 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 29.20 లక్షల కోట్ల)తో ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు. ఒక సంవత్సరం కాలంలో ఆయన సంపద దాదాపు రెట్టింపు పెరగడం విశేషం. ఆ తర్వాత మార్క్ జుకర్‌బర్గ్(216 బిలియన్ డాలర్లు) రెండవ స్థానంలో, జెఫ్ బెజోస్(215 బిలియన్ డాలర్లు), లారీ ఎల్లిసన్ (192 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ (178 బిలియన్ డాలర్ల) టాప్-5లో ఉన్నారు.
ఇక, ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా వాల్‌మార్ట్ వారసురాలైన ఆలిస్ వాల్టన్, 101 బిలియన్ డాలర్లు కలిగి ఉన్నారు. మొత్తం సంపన్నుల జాబితాలో 15వ ర్యాంక్ సాధించారు. ఆమె తర్వాత కోచ్ ఇండస్ట్రీస్‌కు చెందిన జూలియా కోచ్ అండ్ ఫ్యామిల్టీ(74.2 బిలియన్ డాలర్లు-21వ ర్యాంక్), పెట్ ఫుడ్ కంపెనీ మార్స్‌కు చెందిన జాక్వెలిన్ మార్స్ (42.6 బిలియన్ డాలర్లు-33వ ర్యాంక్), కంటెయినర్ షిప్పింగ్ కంపెనీ ఎంఎస్‌సీకి చెందిన రాఫెలా అపోంటే-డైమంట్ (37.7 బిలియన్ డాలర్లు-44వ ర్యాంక్), జిందాల్ ఇండస్ట్రీస్‌కు చెందిన సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ (35.5 బిలియన్ డాలర్లు-48వ ర్యాంక్) ఉన్నారు.






