- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nirmala Sitharaman: మరో గుడ్ న్యూస్ చెప్పిన నిర్మలమ్మ...జీఎస్టీ ధరలపై కీలక అప్ డేట్
Nirmala Sitharaman: వస్తు, సేవల పన్నుకు సంబంధించిన శ్లాబ్స్ సంఖ్యతోపాటు రేట్లను తగ్గించే అంశంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: Nirmala Sitharaman: వస్తు, సేవల పన్నుకు సంబంధించిన శ్లాబ్స్ సంఖ్యతోపాటు రేట్లను తగ్గించే అంశంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సాధ్యమైనంత తక్కువ సంఖ్యలో జీఎస్టీ శ్లాబ్స్, రేట్లు ఉండేలా వస్తు, సేవల పన్ను వ్యవస్థ నిర్మాణంపై సమీక్ష తుది దశకు చేరుకుందని వెల్లడించారు. దీనిపై త్వరలోనే జీఎస్టీ మండలి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన 2025 రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్మలా సీతారామన్ ఈ వివరాలను వెల్లడించారు.
జీఎస్టీ రేట్లను సరళతరంగా, హేతుబద్ధంగా మార్చే ప్రక్రియ వాస్తవానికి మూడేళ్ల క్రితమే మొదలైంది. అయితే కాలక్రమంలో జీఎస్టీ పరిధి పెరిగింది. అందుకే దానిపై సమీక్ష పూర్తి కావడానికి ఇంత సమయం తీసుకుంది. జీఎస్టీ రేట్లపై లోతుగా సమీక్షించమని నేను మంత్రులకు సూచించాను. ఎందుకంటే ఆ రేట్లు, సామాన్య ప్రజలు రోజూ వినియోగించే ఎన్నో వస్తువులు, ఉత్పత్తులతో ముడిపడి ఉన్నాయి. ఇదే మాకు సరైన అవకాశం. తప్పకుండా జీఎస్టీ రేట్లను తగ్గిస్తాం. త్వరలోనే దీనిపై జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
ఆర్థిక మంత్రి నిర్మల ఛైర్మన్ గా ఉండే జీఎస్టీ మండలిలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు. జీఎస్టీ శ్లాబ్స్ సంఖ్యను తగ్గించి..జీఎస్టీ రేట్లలో మార్పులు చేసేందుకు పలువురు మంత్రులతో ప్రత్యేక బ్రుందాన్ని జీఎస్టీ మండలి ఏర్పాటు చేసింది. ప్రస్తుతం జీఎస్టీకి సంబంధించి 4 శ్లాబ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో 5శాతం, 12 శాతం, 18శాతం చొప్పున జీఎస్టీ రేట్లను విధిస్తున్నారు. లగ్జరీ ఉత్పత్తులు, సేవలు, సమాజానికి హాని కలిగించే వస్తువులపై 28శాతం జీఎస్టీ విధిస్తున్నారు. ఆహార పదార్థాలు, నిత్యావసరాలపై 5శాతం జీఎస్టీ వేస్తున్నారని నిర్మలా సీతారామన్ తెలిపారు.
అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను పరిగణలోనికి తీసుకుని జీఎస్టీపై నిర్ణయం తీసుకొంటున్నారనే ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. దేశ ప్రజల బాగును ప్రధాని మోదీ కోరుకుంటున్నారు. అందుకే ఈ మార్పులన్నీ చేస్తున్నారు. ప్రస్తుతం మన దేశ ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నాయి. వ్యవస్థాగతమైన మందగమనం అనేది లేదు. ఇక మూలధన వ్యయాలు తగ్గాయంటున్నారు. అవి అసలు తగ్గలేదు. వాస్తవానికి అవిపెరిగి రూ. 11.21 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో ఇది 4.3శాతం వరకు ఉంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక పాత పన్ను రద్దు చేసే ఆలోచన లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.






