FM Sitaraman: భారత్‌లో అవకాశాల కోసం గ్లోబల్ ఐటీ కంపెనీలకు నిర్మలా సీతారామన్ ఆహ్వానం

by S Gopi |

ఇటీవలి సంవత్సరాల్లో డిజిటల్ ఇండియా ద్వారా భారత్‌లో డిజిటల్ మౌలిక సదుపాయాలు పెరిగాయన్నారు

FM Sitaraman: భారత్‌లో అవకాశాల కోసం గ్లోబల్ ఐటీ కంపెనీలకు నిర్మలా సీతారామన్ ఆహ్వానం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఐదురోజుల అమెరికా పర్యటనకు వెళ్లిన భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అక్కడి ఐటీ కంపెనీలతో భేటీ అయ్యారు. టెక్నాలజీ సహకారంతో పాటు భారత్‌లో పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ అండ్ టీమ్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో మాట్లాడిన సీతారామన్.. 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా భారత్‌తో పాటు ప్రపంచ మార్కెట్ కోసం టెక్నాలజీ అభివృద్ధి చేయాలన్నారు. ఏఐ, క్లౌడ్, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో ఉన్న అవకాశాల గురించి వివరించారు. ఇటీవలి సంవత్సరాల్లో డిజిటల్ ఇండియా ద్వారా భారత్‌లో డిజిటల్ మౌలిక సదుపాయాలు పెరిగాయని, డిజిటలీకరణలో భారత్ ప్రపంచ అగ్రగామిగా ఎదిగిందన్నారు. ఏఐ కోసం ప్రభుత్వం రూపొందించిన పాలసీ ఫ్రేమ్‌వర్క్ గురించి ట్యూరింగ్ సీఈఓ జోనాథన్ సిద్ధార్థ్‌తో జరిగిన సంభాషణలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఇదే సమయంలో డేటా రోబోట్ సీఈఓ దేబంజన్ సాహాను ఏఐ సూపర్ పవర్‌గా భారత్‌కు సామర్థ్యం ఉందని, దీనికోసం 2025-26 బడ్జెట్‌లో రూ. 500 కోట్లను కేటాయించినట్టు ఆర్థిక మంత్రి వివరించారు. ఇండీయా మిషన్ కోసం రూ. 10,300 కోట్ల బడ్జెట్ కేటాయింపులతో పాటు భారత్‌జెన్, సర్వర్మ్-1 ద్వారా ఏఐ లాంగ్వేజ్ టెక్నాలజీ, ఐఐటీ జోధ్‌పూర్‌లో జనరేటివ్ ఏఐ కోసం సృజన్ సెంటర్ ఏర్పాటు సహా అనేక చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.

ఇవికాకుండా, ప్రతిపాదిత రూ. లక్ష కోట్ల కార్పస్, ప్రైవేట్ రంగ ఆధారిత పరిశోధన, అభివృద్ధి, ఇన్నోవేషన్ స్కీమ్‌ల ద్వారా భారత్ అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే ఎంతో ముందుందని, ఏఐ స్కిల్స్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా భారత్‌దే మొదటిస్థానమని మంత్రి పేర్కొన్నారు. ఏ16జెడ్ జనరల్ పార్ట్‌నర్గ్ అంజనీ మేధ, వీఎంవేర్ అడ్వైజర్ రఘు రఘురామ్‌లతో జరిగిన మరో సమావేశంలో విద్య, ఆరోగ్య సమ్రక్షణ, ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌తో సహా ఏఐ విభాగంలోని వివిధ రంగాల్లో సహకారం అందించాలన్నారు. ఏఐ విషయంలో భారత ప్రభుత్వ కృషిని వివరించారు. ఈ సమావేశాల్లో పాల్గొన్న సీఈఓలు కొత్త టెక్నాలజీ అభివృద్ధికి భారత్ తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. ఏఐ విప్లవంలో భారత్ దూసుకెళ్తోందని అభిప్రాయపడ్డారు. ల్యాండ్ అండ్ సీ కేబుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా భారత్ గ్లోబల్ నెట్‌వర్క్‌కు అనుసంధానం చేయాలని థామస్ కురియన్ అన్నారు.

Next Story