- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Income Tax Bill: లోక్‌సభలో సవరించిన ఆదాయపు పన్ను బిల్లు
సవరించిన బిల్లు దేశ ప్రత్యక్ష పన్ను విధానంలో కీలక సంస్కరణగా ఉంటుందని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు.

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో సవరించిన ఆదాయపు పన్ను బిల్లు-2025ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు 1961 నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో తీసుకొచ్చారు. 31 మంది సభ్యుల సెలక్షన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా సవరించిన బిల్లును ఆర్థిక మంత్రి సభ ముందుంచారు. ప్రభుత్వం సెలెక్ట్ కమిటీ సిఫార్సులన్నింటినీ సవరించిన బిల్లులో చేర్చింది. ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెడుతూ.. ఈ బిల్లు ఆదాయపు పన్నుకు సంబంధించిన చట్టాన్ని ఏకీకృతం చేయడంతో పాటు సవరణలకు అవకాశం ఉంటుందని, ఆదాయపు పన్ను చట్టాన్ని భర్తీ చేస్తుందని అన్నారు. సవరించిన బిల్లు దేశ ప్రత్యక్ష పన్ను విధానంలో కీలక సంస్కరణగా ఉంటుందని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు. బిల్లు ప్రవేశపెట్టిన గంటల వ్యవధిలోనే మూజువాణి ఓటుతో బిల్లు సభ ఆమోదం పొందింది. వాస్తవానికి ఈ బిల్లును ప్రభుత్వం ఫిబ్రవరిలోనే లోక్‌సభలో సమర్పించింది. విపక్ష పార్టీల నుంచి అభ్యంతరాలు రావడంతో దాన్ని సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపించారు. కమిటీ పేర్కొన్న ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం, బిల్లులో చేర్చి సవరించిన బిల్లును సోమవారం లోక్‌సభ ముందుకు తీసుకువచ్చారు.
దీంతో పాటు టాక్సేషన్ చట్టాలు(సవరణ)బిల్లును కూడా ఆర్థిక మంత్రి సమర్పించారు. సెలెక్ట్ కమిటీ చేసిన సిఫార్సులలో ఎక్కువ భాగాన్ని ఆమోదించినట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 1961 నాటీ ఆదాయపు పన్ను చట్టాన్ని ఇప్పటివరకు 66 బడ్జెట్లలో (రెండు మధ్యంతర బడ్జెట్లు సహా) అనేక సార్లు సవరించారు. దాంతో పాత చట్టం క్లిష్టంగా మారడమే కాకుండా పన్ను చెల్లింపుదారులపై ఖర్చుల భారం పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని చట్టాన్ని సమీక్షించి సులభతరం చేస్తామని ప్రభుత్వం గతేడాది జూలై నాటి బడ్జెట్‌లో వెల్లడించింది. అందుకనుగుణంగానే కొత్త బిల్లును రూపొందించింది. సులభంగా చెప్పాలంటే, కొత్త చట్టం పాతదానికంటే చదవడం, అర్థం చేసుకోవడం, అమలు చేయడం చాలా సులభంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.






