Flipkart: త్వరలో ఫుడ్ డెలివరీ సేవల్లోకి ఫ్లిప్‌కార్ట్

by S Gopi |

మొదట కొన్ని నగరాల్లో ఈ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించి, వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సేవలను మెరుగుపరిచిన తర్వాత మిగిలిన ప్రాంతాలకు విస్తరించేందుకు కంపెనీ ప్రణాళిక సిద్ధం చేసింది.

Flipkart: త్వరలో ఫుడ్ డెలివరీ సేవల్లోకి ఫ్లిప్‌కార్ట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో కీలక వ్యాపార విభాగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. 'ఫ్లిప్‌కార్ట్ మినిట్స్' ద్వారా క్విక్ కామర్స్ రంగంలోకి వేగంగా దూకుడు చూపిస్తున్న కంపెనీ, త్వరలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించనుంది. రాబోయే కొద్ది వారాల్లోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి ధృవీకరించారు. మొదట కొన్ని నగరాల్లో ఈ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించి, వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సేవలను మెరుగుపరిచిన తర్వాత మిగిలిన ప్రాంతాలకు విస్తరించేందుకు కంపెనీ ప్రణాళిక సిద్ధం చేసింది. కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ ప్రధాన యాప్‌తో పాటు ప్రత్యేక యాప్ ద్వారా కూడా ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు. అంతేకాకుండా, ప్రభుత్వ మద్దతు ఉన్న ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్ డీసీ)తో అనుసంధానం కావడం ద్వారా ఎక్కువ సంఖ్యలో రెస్టారెంట్లు, డెలివరీ పార్టనర్స్ నెట్‌వర్క్‌ను మెరుగ్గా వినియోగించుకోవాలని సంస్థ భావిస్తోంది.

ప్రస్తుతం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో జొమాటో, స్విగ్గీలు ఆధిపత్యం చెలాయిస్తుండగా, ఇటీవల ర్యాపిడో 'ఓన్లీ' పేరుతో జీరో కమీషన్ మోడల్ ద్వారా పోటీని మరింత పెంచింది. మరోవైపు జొమాటో మాతృసంస్థ ఎటర్నల్ కూడా 'బిస్ట్రో' వంటి కొత్త ప్రయోగాలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అధిక పోటీ ఉన్న ఫుడ్ డెలివరీ మార్కెట్‌లోకి ప్రవేశిస్తోంది. ఇప్పటికే చిన్న నగరాల్లో (టైర్ 2, టైర్ 3) మెరుగైన ఆదరణతో పాటు 40 శాతానికి పైగా 'జెన్ జీ ' యూజర్ల బేస్ ఉండటం తమకు పెద్ద ప్లస్ పాయింట్ అని కంపెనీ పేర్కొంది.

Next Story