ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా లేఆఫ్స్.. 500 మందికి ఉద్వాసన!

by Naga Rani Yarlagadda |

ఫ్లిప్‌కార్ట్‌లో ప్రతీఏటా 1-2 శాతం ఉండే ఉద్యోగుల లేఆఫ్స్ ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. ఏకంగా 500 మందిని వెళ్లిపోవాలని కంపెనీ కోరినట్లు సమాచారం.

ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా లేఆఫ్స్.. 500 మందికి ఉద్వాసన!
X

దిశ, వెబ్‌డెస్క్: వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart Layoffs) తన వార్షిక పనితీరు సమీక్షలో భాగంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమైంది. Economic Times నివేదిక ప్రకారం.. ఈ ఏడాది దాదాపు 400 నుంచి 500 మంది ఉద్యోగులను కంపెనీ నుంచి వైదొలగాలని సంస్థ కోరినట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతిఏటా పనితీరు సరిగ్గా లేని (Lowest performance bracket) 1-2 శాతం మందిని ఫ్లిప్‌కార్ట్ తొలగిస్తుంటుంది. అయితే.. ఈసారి ఆ సంఖ్య 3-4 శాతానికి పెరగడం గమనార్హం. స్పష్టమైన నిబంధనలకు అనుగుణంగా క్రమం తప్పకుండా పనితీరు సమీక్షలు నిర్వహిస్తామని, ఇందులో భాగంగానే కొంతమంది ఉద్యోగులు సంస్థ నుండి నిష్క్రమిస్తారని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. ప్రభావితమైన ఉద్యోగులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను (Transition support) అందిస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ స్పష్టం చేసింది.

ఐపీఓకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలోనే ఈ కోతలు విధిస్తున్నప్పటికీ.. సీనియర్ స్థాయిలో నియామకాలను మాత్రం కంపెనీ కొనసాగిస్తోంది. ఐపీఓ లక్ష్యంగా ఫ్లిప్‌కార్ట్ తన లీగల్ డొమిసిల్‌ను సింగపూర్ నుంచి భారత్‌కు మార్చేందుకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) నుండి డిసెంబర్ 2025లో అనుమతి పొందింది. భారతీయ నిబంధనలకు అనుగుణంగా గ్రూప్ నిర్మాణాన్ని సరళీకృతం చేసేందుకు సింగపూర్‌కు చెందిన 8 సంస్థలను 'ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్'లో విలీనం చేసింది. ఒకవైపు లేఆఫ్స్ చేస్తూనే.. మరోవైపు నాయకత్వ బృందాన్ని బలోపేతం చేసేందుకు కంపెనీ పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించడం గమనార్హం.

వ్యాపార ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్ 'టోఫ్లర్' (Tofler) డేటా ప్రకారం ఫ్లిప్‌కార్ట్ ఆర్థిక స్థితి గమనిస్తే.. నష్టాలున్నా.. ఆదాయం వృద్ధి కూడా కనిపిస్తుండటం ఆశ్చర్యకరమనే చెప్పాలి. ఆర్థిక సంవత్సరం 2025లో ఫ్లిప్‌కార్ట్ ఇండియా నష్టాలు రూ.5,189 కోట్లుగా నమోదయ్యాయి. 2024లో ఈ నష్టాల సంఖ్య రూ.4,248.3 కోట్లుగా ఉంది. కంపెనీ నిర్వహణ ఆదాయం 17.3 శాతం పెరిగి రూ.82,787.3 కోట్లకు చేరుకుంది. స్టాక్ కొనుగోళ్లు పెరగడం వల్ల కంపెనీ మొత్తం ఖర్చులు 17.4% పెరిగి రూ.88,121.4 కోట్లకు చేరాయి. ఒకవైపు నష్టాలు పెరుగుతున్నా, మరోవైపు ఆదాయం వృద్ధి చెందుతుండటంతో.. ఐపీఓకు ముందు సంస్థను లాభదాయకత దిశగా మళ్లించేందుకు ఫ్లిప్‌కార్ట్ ఈ వ్యూహాత్మక మార్పులు చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story