IRCTC: మొదటి 15 నిమిషాలు... ఆధార్-లింక్డ్ యూజర్లకే రైలు టికెట్ రిజర్వేషన్

by S Gopi |

వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ప్రయత్నించే వారి కోసం కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది.

IRCTC: మొదటి 15 నిమిషాలు... ఆధార్-లింక్డ్ యూజర్లకే రైలు టికెట్ రిజర్వేషన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: రైలు టికెట్ రిజర్వేషన్‌కు సంబంధించి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) కీలక ప్రకటన చేసింది. వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ప్రయత్నించే వారి కోసం కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా జనరల్ రిజర్వేషన్ విండో తెరిచిన మొదటి 15 నిమిషాలు ఆధార్-లింక్డ్ వినియోగదారులకు మాత్రమే రిజర్వేషన్ చేసుకునే వీలుంటుంది. ఈ నిబంధన ప్రస్తుతం తత్కాల్ బుకింగ్ విధానంలో మాత్రమే వర్తిస్తుండగా, అక్టోబర్ 1 నుంచి సాధారణ రిజర్వేషన్లకు కూడా అమలు చేయనున్నట్టు ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది. అయితే, రైల్వే కౌంటర్ల నుంచి టిక్కెట్లను బుక్ చేసుకోవాలనుకునే వారికి ఎటువంటి మార్పు ఉండదు. మునుపటిలాగే పీఆర్ఎస్ కౌంటర్లలో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 60 రోజులకు ముందుగా టికెట్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయం ఉంది. అయితే, తత్కాల్ టికెట్ల తరహాలోనే బుకింగ్ ప్రక్రియ మొదలైన తక్షణం కొందరు అక్రమంగా సాఫ్ట్‌వేర్ సాయంతో టికెట్లను బుక్ చేస్తున్నారు. దీనివల్ల సాధారణ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరిస్తూ రిజర్వేషన్ టికెట్ల విషయంలో పారదర్శకతను, సాధారణ యూజర్లకు కూడా రిజర్వేషన్ ప్రయోజనలను అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నామని ఐఆర్‌సీటీసీ వెల్లడించింది.

Next Story