- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPO: మారిన ఐపీఓ రూల్స్
పబ్లిక్ ఇష్యూ తర్వాత మార్కెట్ విలువతో సంబంధం లేకుండా కనీసం 2.5 శాతం వాటా విక్రయించాలి.

దిశ, బిజినెస్ బ్యూరో: కంపెనీల ఐపీఓకు సంబంధించిన నిబంధనల్లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక సవరణలు చేసింది. స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయ్యే కంపెనీల ఐపీఓ తర్వాత మార్కెట్ విలువ ఆధారంగా వాటిని వర్గీకరించింది. దీనికోసం సెబీ ప్రతిపాదించిన సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ (రెగ్యులేషన్) అమెండ్‌మెంట్ రూల్స్, 2026ను మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. దీని ప్రకారం, పబ్లిక్ ఇష్యూ తర్వాత మార్కెట్ విలువతో సంబంధం లేకుండా కనీసం 2.5 శాతం వాటా విక్రయించాలి. ఇష్యూ తర్వాత రూ. 1,600-రూ. 5,000 కోట్ల మార్కెట్ విలువ ఉన్న కంపెనీలు మూడేళ్లలో 25 శాతం పబ్లిక్ వాటాను చేరుకోవాలి. రూ. 1,600 కోట్ల కంటే తక్కువ విలువైన కంపెనీలు 25 శాతానికి సమానమైన ఈక్విటీ షేర్లు లేదా డిబెంచర్లను ఐపీఓ సమయంలోనే విక్రయించాలి. రూ. 4 వేల కోట్ల లోపు ఉన్న కంపెనీలు కనీసం రూ. 400 కోట్ల విలువైన షేర్లను, రూ. 4 వేల నుంచి రూ. 5 వేల కోట్ల విలువైన కంపెనీలు 10 శాతానికి సమానమైన ఈక్విటీ షేర్లను అమ్మాలి.
అలాగే, లిస్టింగ్ తర్వాత మార్కెట్ విలువ రూ. 5,000 కోట్ల నుంచి రూ. లక్ష కోట్లు ఉంటే, రూ. వెయ్యి కోట్లకు సమానమైన ఈక్విటీ షేర్లు లేదంటే డిబెంచర్లను జారీ చేయాలి. తర్వాత ఐదేళ్లలో 25 శాతం పబ్లిక్ షేర్ హోల్డింగ్ కలిగి ఉండాలి. ఇక, రూ. 1-5 లక్షల కోట్ల మధ్య ఉండే కంపెనీలు 2.75 శాతం వాటాకు సమానంగా రూ. 6,250 కోట్లు ఐపీఓలో ఉంచాలి. రూ. 5 లక్షల కోట్లకు పైన ఉన్న కంపెనీలు రూ. 15 వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచాలి.






