Housing Demand: జీఎస్టీ రేట్ల తగ్గింపుతో ఇళ్ల డిమాండ్‌కు ఊతం: క్రెడాయ్

by S Gopi |

పండుగ సీజన్ సమయంలో తీసుకున్న ఈ నిర్ణయంతో సెంటిమెంట్ మరింత ఊపందుకునే అవకాశం ఉందని క్రెడాయ్ ఛైర్మన్ బొమన్ ఇరానీ అన్నారు.

Housing Demand: జీఎస్టీ రేట్ల తగ్గింపుతో ఇళ్ల డిమాండ్‌కు ఊతం: క్రెడాయ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: వివిధ రకాల ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ద్వారా వినియోగదారుల కొనుగోలు శక్తి పెరుగుతుందని, పండుగ సీజన్‌లో నివాస ఇళ్లకు డిమాండ్ పెరుగుతుందని ప్రముఖ రియల్టర్ల సంస్థ క్రెడాయ్ తెలిపింది. ముఖ్యంగా జీఎస్టీ పన్ను రేట్లను తగ్గించడం వల్ల నిర్మాణ రంగంలో కీలకమైన పరికరాలు, ఇళ్ల నిర్మాణంలో వాడే సామగ్రి ఖర్చు తగ్గుతుంది. పండుగ సీజన్ సమయంలో తీసుకున్న ఈ నిర్ణయంతో సెంటిమెంట్ మరింత ఊపందుకునే అవకాశం ఉందని క్రెడాయ్ ఛైర్మన్ బొమన్ ఇరానీ అన్నారు. ఈ ఏడాది యూనియన్ బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయాలకు తోడు, ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం, తాజా జీఎస్టీ శ్లాబుల తగ్గింపు వంటి వరుస పాజిటివ్ పరిణామాలు నివాస ఇళ్ల విభాగంలో గిరాకీకి దోహదపడుతుంది. ఈ ఏడాది ప్రథమార్థంలో ఇళ్ల విక్రయాలు పెరిగినప్పటికీ, ఎక్కువ సంఖ్యలో అమ్మకాలు జరగలేదు. ప్రభుత్వ తాజా నిర్ణయాలు ఇందుకు మద్దతిస్తాయని, డిమాండ్ పెరిగి ఎక్కువ ఇళ్లను విక్రయించే అవకాశం ఏర్పడుతుందని క్రెడాయ్ అధ్యక్షుడు శేఖర్ పటేల్ అభిప్రాయపడ్డారు. సింగపూర్‌ వేదికగా జరిగిన వార్షిక సదస్సు సందర్భంగా మరోసారి క్రెడాయ్‌ కీలక ప్రతిపాదనను వ్యక్తం చేసింది. ఇప్పుడున్న మార్కెట్‌ను పరిగణలోకి తీసుకుని నివాస ఇళ్ల నిర్వచనంలో ప్రభుత్వం మార్పులు చేయాలని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న సరసమైన ఇళ్ల పరిమితి రూ. 45 లక్షలను పెంచాలని కోరింది. ఎందుకంటే, సరసమైన ఇళ్లపై ప్రస్తుతం 1 శాతం జీఎస్టీ ఉంది. ఆపైన ఇళ్లకు 5 శాతం జీఎస్టీ వర్తిస్తోంది. పరిమితి పెంచడం వల్ల ఎక్కువమంది ఇళ్లను కొనుగోలు చేసే వీలుంటుందని క్రెడాయ్ వెల్లడించింది.

Next Story