- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Exporters: కేంద్రమే ఆర్థిక సహకారం, క్రెడిట్ సౌకర్యం కల్పించాలని కోరుతున్న ఎగుమతిదారులు
ట్రంప్ ప్రకటించిన అధిక సుంకాల వల్ల అమెరికా మార్కెట్లో తమకు సమస్యలు ఉత్పన్నమవుతాయని ఓ ఎగుమతిదారు చెప్పారు.

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 25 శాతం సుంకం భారాన్ని తట్టుకునేందుకు దేశంలోని వివిధ రంగాలకు చెందిన ఎగుమతిదారులు ప్రభుత్వ సాయాన్ని ఆశిస్తున్నారు. ఆహార, సముద్ర, టెక్స్‌టైల్ సహా పలు రంగాలకు చెందిన ఎగుమతిదారులు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం, సరసరమైన వడ్డీతో రుణ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి ముంబైలో వాణిజ్య, పరిశ్రాల మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం అనంతరం కొందరు ఎగుమతిదారులు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం తరహాలో నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నట్టు చెప్పారు. ట్రంప్ ప్రకటించిన అధిక సుంకాల వల్ల అమెరికా మార్కెట్లో తమకు సమస్యలు ఉత్పన్నమవుతాయని ఓ ఎగుమతిదారు చెప్పారు. ఈ అంశంపై ఎగుమతిదారుల సంఘం సూచనలు లిఖితపూర్వకగా పంపాలని మంత్రి సూచించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా తాము తక్కువ వడ్డీతో కూడైన రుణాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు డిమాండ్ చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఎగుమతిదారుల ప్రకారం, సాధారంగా ఎగుమతిదారులకు 8 నుంచి 12 శాతం లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. ఇవి కూడా బ్యాంకులు రుణగ్రహీత వ్యాపారం, రిస్క్ అంచనాపై ఆధారపడి ఉంటుంది. కొన్ని వేరే దేశాల్లో ఈ వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు, సెంట్రల్ బ్యాంకు రేటు ఆధారంగా ఎగుమతిదారులపై చైనాలో 3.1 శాతం, మలేషియాలో 3 శాతం, థాయిలాండ్‌లో 2 శాతం, వియత్నాంలో 4.5 శాతం వడ్డీ ఉంటుంది. మిగిలిన రంగాలతో పోలిస్తే టెక్స్‌టైల్స్, రొయ్యల వంటి రంగాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అమెరికా ఆర్డర్లను రద్దు చేయడం లేదా వెనక్కి తీసుకోవడం ఇప్పటికే ప్రారంభమైంది. రానున్న నెలల్లో ఇది మనదేశం నుంచి అమెరికాకు ఎగుమతులపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా ఎగుమతి రంగంలో ఉద్యోగాలు పోతాయని కొందరు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకం ఇవ్వడం కూడా కష్టమవ్వొచ్చని కొందరు భావిస్తున్నారు. భారత లెదర్, ఫ్యాషన్ ఎగుమతుల్లో అమెరికా వాటా 30 శాతానికి పైగా ఉంది.






