Nayara Energy: మైక్రోసాఫ్ట్‌ సేవలు నిలిపేయడంపై కోర్టును ఆశ్రయించిన నయారా ఎనర్జీ

by S Gopi |

పూర్తిగా చెల్లించిన లైసెన్స్‌ల కింద కొనుగోలు చేసినప్పటికీ మైక్రోసాఫ్ట్ యాక్సెస్ అనుమతించలేదని కంపెనీ తెలిపింది.

Nayara Energy: మైక్రోసాఫ్ట్‌ సేవలు నిలిపేయడంపై కోర్టును ఆశ్రయించిన నయారా ఎనర్జీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: యూరోపియన్ యూనియన్ ఆంక్షల తర్వాత టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రష్యన్ చమురు దిగ్గజం రోస్‌నెఫ్ట్ మద్దతుగల నయారా ఎనర్జీకి సేవలు అందించడం ఆపేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంపై భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నయారా ఎనర్జీ ఢిల్లీ హైకోర్టులో మైక్రోసాఫ్ట్‌పై దావా వేసింది. తమ కార్యకలాపాలకు సంబంధించి కీలకమైన సేవలను ఆకస్మికంగా, ఏకపక్షంగా నిలిపేసిందని నయారా ఆరోపించింది. అందుకే తాము చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యాం. మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం నయారా ఎనర్జీకి చెందిన స్వంత డేటా, యాజమాన్య సాధనాలు, ఉత్పత్తుల యాక్సెస్‌ను పరిమితం చేసింది. వీటిని పూర్తిగా చెల్లించిన లైసెన్స్‌ల కింద కొనుగోలు చేసినప్పటికీ మైక్రోసాఫ్ట్ యాక్సెస్ అనుమతించలేదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా, కంపెనీ ఉద్యోగుల ఔట్‌లుక్ ఈమెయిల్ అకౌంట్లు, టీమ్స్ పనిచేయడం లేదని తెలిపింది. ఉక్రెయిన్‌తో యుద్ధంపై రష్యాకు వ్యతిరేకంగా కొత్త చర్యలలో భాగంగా ఈ నెల ప్రారంభంలో యూరోపియన్ యూనియన్ నయారాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. నయారా ఎనర్జీ తన హక్కులను కాపాడుకోవడానికి, అవసరమైన డిజిటల్ మౌలిక సదుపాయాలకు నిరంతర పనితీరు కొనసాగేందుకు జోక్యం చేసుకోవాలని, కంపెనీలు సేవలు తిరిగి ప్రారంభించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సేవలు నిలిపేయడానికి ముందు మైక్రోసాఫ్ట్ తమతో ఎలాంటి సంప్రదింపులు చేయలేదని పిటిషన్‌లో పేర్కొంది.

Next Story