- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ethanol ATM: మార్కెట్లోకి ‘ఇథనాల్ ఏటీఎంలు’
ప్రత్యేక ‘ఇథనాల్ ఏటీఎంల’ ద్వారా వినియోగదారులు క్యాన్లలో ఇథనాల్ కొనుగోలు చేసి, ప్రత్యేక స్టవ్‌లలో ఉపయోగించే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో ఇథనాల్ ప్రయాణం ఇప్పుడు కొత్త దశలోకి అడుగుపెడుతోంది. ఇప్పటివరకు పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం (ఈ20) ద్వారా ముడి చమురు దిగుమతులను తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఉండగా, ఇప్పుడు ప్రభుత్వం ఇథనాల్‌ను వంట ఇంధనంగా కూడా అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి పెట్టింది. ప్రత్యేక ‘ఇథనాల్ ఏటీఎంల’ ద్వారా వినియోగదారులు క్యాన్లలో ఇథనాల్ కొనుగోలు చేసి, ప్రత్యేక స్టవ్‌లలో ఉపయోగించే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఫ్లెక్స్-ఫ్యూయెల్ వాహనాలు, సుస్థిర విమానయాన ఇంధనం (ఎస్ఏఎఫ్), ఎగుమతులు వంటి కొత్త వినియోగ రంగాలపైనా ప్రభుత్వం ఫోకస్ పెంచుతోంది. 2014-15లో కేవలం 1.5 శాతం ఉన్న ఇథనాల్ బ్లెండింగ్ ఇప్పుడు 20 శాతానికి చేరుకుంది. దీంతో విదేశీ మారకంలో రూ.1.4 లక్షల కోట్లకు పైగా ఆదా కావడంతో పాటు రైతులు, చక్కెర మిల్లులు, డిస్టిలరీలకు కొత్త ఆదాయ వనరులు లభించాయి.
వంటగదిలోకి ఇథనాల్ ఎంట్రీ
దేశీయ ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం ఏటా 24 బిలియన్(2,400 కోట్ల) లీటర్లకు చేరుతోంది. అయితే, పెట్రోల్ బ్లెండింగ్, ఇతర పరిశ్రమల అవసరాలు కలిపి 14.5 బిలియన్(1,450 కోట్ల) లీటర్ల డిమాండ్ మాత్రమే ఉండటంతో, మిగిలిపోయే 7 బిలియన్(700 కోట్ల) లీటర్ల ఇథనాల్ కోసం ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. అందుకే మిగులు ఇథనాల్ సమస్యను పరిష్కరించేందుకు సిద్ధమైంది. దేశంలో గృహ అవసరాల కోసం ఎల్‌పీజీ దిగుమతులపై విపరీతంగా ఆధారపడకుండా, దేశీయంగా తయారయ్యే ఇథనాల్‌ను వంట గ్యాస్‌లా వాడేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన స్టవ్‌లతో పాటు, కస్టమర్లు నేరుగా వెళ్లి క్యాన్లలో ఇథనాల్ నింపుకునేలా 'ఇథనాల్ ఏటీఎం' నెట్‌వర్క్‌ను, ఒక కొత్త రిటైల్ పర్యావరణ వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి సబ్సిడీల భారం తగ్గడమే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతం లభిస్తుంది. అంతేకాకుండా, సొంతంగా ఉత్పత్తి సామర్థ్యం లేని నేపాల్, బంగ్లాదేశ్, ఇండోనేషియా వంటి పొరుగు దేశాలకు ఎగుమతి చేయడంపై కూడా భారత్ గట్టిగా ఫోకస్ చేస్తోంది.
విమాన ఇంధనంగా కూడా
అంతేకాకుండా, 2027 నాటికి అంతర్జాతీయ విమానాలలో కనీసం 1 శాతం సుస్థిర విమానయాన ఇంధనం(ఎస్ఏఎఫ్) కలపాలనే నిబంధనను కేంద్రం తెచ్చింది. ఇందులో భాగంగా 'ఆల్కహాల్-టు-జెట్' సాంకేతికత ద్వారా ఇథనాల్‌ను నేరుగా జెట్ ఫ్యూయెల్‌గా మార్చే ప్రక్రియ వేగవంతమైంది. దీనికోసం ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ, జీపీఎస్ రెన్యూవబుల్స్ సంస్థలు సంయుక్తంగా విశాఖపట్నం సమీపంలో దేశంలోనే మొదటి ఇథనాల్-టు-జెట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నాయి.
20 శాతానికి మించి ఇథనాల్ బ్లెండ్ ఆలోచన లేదు
ఇదే సమయంలో, పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుత 20 శాతానికి మించి పెంచే ఆలోచన లేదని పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఈ20 కంటే ఎక్కువ మిశ్రమాన్ని అమలు చేయాలంటే ముందుగా శాస్త్రీయ అధ్యయనాలు, సాంకేతిక పరీక్షలు, ఆటోమొబైల్ తయారీ సంస్థలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, పరిశోధనా సంస్థలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలాగే, స్వచ్ఛమైన పెట్రోల్ లేదా ఈ10 వంటి తక్కువ ఇథనాల్ మిశ్రమాలను దేశవ్యాప్తంగా మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలనే ప్రతిపాదన కూడా లేదని స్పష్టం చేశారు. దానివల్ల లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడమే కాకుండా, ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణ, రైతుల ఆదాయానికి కలిగే ప్రయోజనాలు దెబ్బతింటాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ20 వల్ల పాత వాహనాల్లో మైలేజీ 3-5 శాతం వరకు తగ్గే అవకాశం ఉన్నా, అది పెద్ద సమస్య కాదని ప్రభుత్వం చెబుతోంది. ఈ20 వల్ల ఇంజిన్ దెబ్బతింటుందన్న వాదనలకు ఇప్పటివరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లభించలేదని చెప్పారు. ఇప్పటివరకు ఇథనాల్ బ్లెండింగ్ వల్ల రూ.1.97 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యం ఆదా, 3.16 కోట్ల టన్నుల ముడి చమురు దిగుమతుల తగ్గింపు, 952 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాల తగ్గింపు, అలాగే రైతులకు రూ.1.66 లక్షల కోట్లకు పైగా అదనపు ఆదాయం లభించినట్లు వెల్లడించారు.






