ETF Inflows: రికార్డు స్థాయిలో రూ. 1.8 లక్షల కోట్ల ఈటీఎఫ్ పెట్టుబడులు

by S Gopi |

2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈటీఎఫ్‌లు రికార్డు స్థాయిలో రూ. 1.8 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించాయి.

ETF Inflows: రికార్డు స్థాయిలో రూ. 1.8 లక్షల కోట్ల ఈటీఎఫ్ పెట్టుబడులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ పెట్టుబడుల రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భౌగోళిక రాజకీయ పరిణామాల మధ్య క్రమంగా ఈటీఎఫ్‌లకు అత్యంత ఆదరణ పెరుగుతోంది. తాజాగా జెరొధా ఫండ్ హౌస్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈటీఎఫ్‌లు రికార్డు స్థాయిలో రూ. 1.8 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించాయి. ఇది గతంలో నమోదైన ఏ సంవత్సరంతో పోల్చినా రెట్టింపు కంటే ఎక్కువ. ఇప్పటివరకు ఈటీఎఫ్‌లు ఈక్విటీ మార్కెట్‌కే పరిమితం అయ్యేవి. కానీ ఇప్పుడు పెట్టుబడిదారుల దృష్టి క్రమంగా మారుతోంది. అయితే, ఈ పెట్టుబడులు ప్రధానంగా గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లలోకే వెళ్తుండటం విశేషం. మొత్తం పెట్టుబడుల్లో 55 శాతం వాటా వీటిలోకే వెళ్తున్నాయి. అంటే, ఈక్విటీ ఈటీఎఫ్‌లనులను కూడా మించి కమోడిటీ ఈటీఎఫ్‌లే ఎక్కువ నిధులను ఆకర్షిస్తున్నాయి. అస్థిరంగా మారిన అంతర్జాతీయ పరిస్థితులు, మార్కెట్ అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడిదారులు భద్రత కోసం బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకలు అభిప్రాయపడుతున్నారు. సమీక్షించిన కాలంలో ఒక్క గోల్డ్ ఈటీఎఫ్‌లలోకే రూ. 68,868 కోట్లు(38 శాతం), సిల్వర్ ఈటీఎఫ్‌లలోకి రూ. 30,412 కోట్లు(16.8 శాతం), ఈక్విటీల్లోకి రూ. 77,780 కోట్లు(42.9 శాతం), డెట్‌లోకి రూ. 4,066 కోట్లు(2.2 శాతం) వచ్చాయి. కేవలం బంగారం, వెండి కలిపే రూ. 99,280 కోట్లు(55 శాతం) ఉన్నాయని నివేదిక వెల్లడించింది.

Next Story