Ericson: బెంగళూరులో ఎరిక్సన్ కొత్త ఆర్అండ్‌డీ సెంటర్

by S Gopi |

ఈ సెంటర్ ద్వారా 5జీ బేస్‌బ్యాండ్ కోసం అధునాతన 5జీ ఫీచర్లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తామని కంపెనీ తెలిపింది.

Ericson: బెంగళూరులో ఎరిక్సన్ కొత్త ఆర్అండ్‌డీ సెంటర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టెలికాం గేర్ తయారీ సంస్థ ఎరిక్సన్ బెంగళూరులో రేడియో యాక్సెస్ నెట్‌వర్క్(ర్యాన్) సాఫ్ట్‌వేర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్(ఆర్అండ్‌డీ) యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం ప్రకటించింది. ఈ సెంటర్ ద్వారా ఎరిక్సన్‌కు చెందిన 5జీ బేస్‌బ్యాండ్ కోసం అధునాతన 5జీ ఫీచర్లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తామని కంపెనీ తెలిపింది. దీని ద్వారా దేశంలో ర్యాన్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి కీలక ముందడుగు అవుతుంది. కంపెనీ ఇప్పటివరకు దేశీయంగా ఉన్న సాఫ్ట్‌వేర్ ప్రతిభను ఉపయోగించుకుందని, కొత్త ఆర్అండ్‌డీ సెంటర్ ద్వారా టెలికాం పరిశ్రమను మరింత బలోపేతం చేసేందుకు వీలవుతుందని ఎరిక్సన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నితిన్ బన్సాల్ అన్నారు. ఈ కొత్త ఆర్అండ్‌డీ కేంద్రంతో కంపెనీ భవిష్యత్తు సాంకేతిక ప్రణాళికలకు భారత్‌ను కీలకంగా చూస్తున్నామని, ఎరిక్సన్ మొదటిసారిగా ర్యాన్ సాఫ్ట్‌వేర్‌ను సృష్టిస్తోందని, దేశంలో మరింత సమర్థవంతంగా భాగస్వామ్యాలను కొనసాగించేందుకు ఇది వీలు కల్పిస్తుందని కంపెనీ వివరించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత సాంకేతిక పరిశ్రమకు తమ వంతు సహకారం అందిస్తామని, అంతర్జాతీయంగా కొత్త ఆవిష్కరణలకు భారత్ కొత్త పరిష్కారాలను అందించడంలో ముందంజలో ఉందని కంపెనీ పేర్కొంది.

Next Story