పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్: ఇక చిటికెలో మీ సొమ్ము మీ చేతికి..

by Naga Rani Yarlagadda |

ప్రావిడెంట్ ఫండ్ (PF) డబ్బు తీసుకోవాలంటే రోజులు, వారాలు ఎదురుచూడాల్సి వచ్చిందా? అయితే ఇక ఆ సమస్యకు పరిష్కారం రానుంది.

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్: ఇక చిటికెలో మీ సొమ్ము మీ చేతికి..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రావిడెంట్ ఫండ్ (PF) డబ్బు తీసుకోవాలంటే రోజులు, వారాలు ఎదురుచూడాల్సి వచ్చిందా? అయితే ఇక ఆ సమస్యకు పరిష్కారం రానుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన సేవలను మరింత వేగవంతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఏప్రిల్ 2026 నాటికి ఒక కొత్త మొబైల్ యాప్‌ను ప్రారంభించి.. దాని ద్వారా UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ఉపయోగించి తక్షణమే పీఎఫ్ నగదును విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. ఈ చర్య EPFO 3.0 అప్‌గ్రేడ్‌లో భాగంగా చేపడుతున్నారు. పీఎఫ్ ఖాతాను బ్యాంకింగ్ యాప్‌లా సులభంగా వినియోగించుకునేలా మార్చడమే దీని లక్ష్యం.

యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా ఎలా పనిచేస్తుంది?

ప్రతిపాదిత విధానం ప్రకారం.. అర్హత ఉన్న పీఎఫ్ మొత్తాన్ని యూపీఐ పిన్ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా క్లెయిమ్ దాఖలు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ప్రాథమిక చర్చల ప్రకారం.. ప్రతి లావాదేవీకి గరిష్టంగా రూ. 25,000 వరకు విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. పదవీ విరమణ తర్వాత అవసరాల కోసం కనీసం 25% బ్యాలెన్స్‌ను ఖాతాలోనే ఉంచి, మిగిలిన మొత్తాన్ని మాత్రమే విత్‌డ్రా చేసుకునేలా నిబంధనలు ఉండనున్నాయి. ఈ సౌకర్యం ప్రత్యేక EPFO యాప్ ద్వారా అందుబాటులోకి రానుంది. ప్రముఖ యూపీఐ ప్లాట్‌ఫామ్‌లతో కూడా ఇది అనుసంధానమవుతుంది. ప్రస్తుతం 100 డమ్మీ ఖాతాలపై పరీక్షలు నిర్వహిస్తూ, సాంకేతిక లోపాలను సరిదిద్దుతున్నారు.

Next Story