Elon Musk: ఎలన్ మస్క్ ఒక్క రోజు లాభం.. అంబానీ మొత్తం సంపద కంటే ఎక్కువ

by S Gopi |

ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన భారీ డిమాండ్ కారణంగా కేవలం ఒకే ఒక్క ట్రేడింగ్ రోజున స్పేస్‌ఎక్స్ షేర్లు 14.71 శాతం రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి.

Elon Musk: ఎలన్ మస్క్ ఒక్క రోజు లాభం.. అంబానీ మొత్తం సంపద కంటే ఎక్కువ
X

దిశ, బిజినెస్ బ్యూరో: వాల్ స్ట్రీట్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నాస్‌డాక్‌లో 'స్పేస్‌ఎక్స్' ఐపీఓ సృష్టించిన సంచలనంతో ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించారు. ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన భారీ డిమాండ్ కారణంగా కేవలం ఒకే ఒక్క ట్రేడింగ్ రోజున స్పేస్‌ఎక్స్ షేర్లు 14.71 శాతం రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి. ఫలితంగా మస్క్ ఆస్తి కేవలం 24 గంటల్లోనే ఏకంగా 164.8 బిలియన్ డాలర్లు పెరిగి, ఆయన మొత్తం నికర ఆస్తి విలువ 1.3 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ. 108 లక్షల కోట్లు) చేరింది. ఇది కేవలం ఒక రోజులో నమోదైన అతిపెద్ద సంపద పెరుగుదలల్లో ఒకటిగా నిలిచింది. మరో ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ సంపద వృద్ధి మనదేశ అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ మొత్తం సంపద 89.7 బిలియన్ డాలర్లతో పోలిస్తే, మస్క్ ఒక్క రోజులోనే దానికి దాదాపు రెండింతల సంపదను ఆర్జించారు. అంటే మస్క్ ఒక్క రోజులో సంపాదించిన సంపద, అంబానీ మొత్తం నికర విలువకు దాదాపు రెట్టింపు. ఈ గణాంకాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎలన్ మస్క్ సంపదను ఇతర బిలియనీర్ల సంపదతో పోలుస్తూ నెటిజన్లు లెక్కిస్తున్నారు. ప్రస్తుతం స్పేస్‌ఎక్స్‌లో మస్క్ సొంత వాటాల విలువ ఒక్కటే 866 బిలియన్ డాలర్లకు చేరుకోగా, ఆయన మొత్తం ఆస్తి భారత దేశ జీడీపీ (సుమారు 4.15 ట్రిలియన్ డాలర్లు)లో దాదాపు నాల్గవ వంతుకు సమానమవ్వడం విశేషం.

Next Story