GST: జీఎస్టీ అమలై ఎనిమిదేళ్లు

by S Gopi |

వస్తుసేవల రంగంలో వివిధ పరోక్ష పన్నులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం కోసం జీఎస్టీని 2017, జులై 1 నుంచి ప్రవేశపెట్టారు.

GST: జీఎస్టీ అమలై ఎనిమిదేళ్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశ పరోక్ష పన్నుల వ్యవస్థలో అతిపెద్ద సంస్కరణగా నిలిచిన జీఎస్టీ చట్టం అమలై నేటితో ఎనిమిదేళ్లు పూర్తయింది. వస్తుసేవల రంగంలో కేంద్ర, రాష్ట్రాలు విధించే వివిధ పరోక్ష పన్నులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం కోసం జీఎస్టీని 2017, జులై 1 నుంచి ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఇది మన దైనందిన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఒక కప్పు టీ మొదలుకొని కారు వరకు, మనం కొనుగోలు చేసే దాదాపు ప్రతిదానికీ జీఎస్టీ అమలవుతోంది. అయితే, ఈ ఎనిమిదేళ్లలో జీఎస్టీ నిజంగా ఏమి సాధించింది? ఈ వ్యవస్థ ఎంతవరకు వచ్చిందో చూపించే ఐదు ముఖ్యమైన అంశాలను చూద్దాం.

'ఒక దేశం, ఒక పన్ను'

జీఎస్టీకి ముందు వ్యాపార వర్గాలు వ్యాట్, సేవా పన్ను, ఎక్సైజ్ సుంకం లాంటి వివిధ పన్నులను చెల్లించేవి. పాత పన్నుల విధానం వల్ల అనేక విషయాలు సంక్లిష్టంగా ఉండేవి. జీఎస్టీ రాకతో వివిధ పన్నులను ఒకే, ఏకరీతి పన్ను ద్వారా భర్తీ చేశారు. ఇది కంపెనీలు, స్టోర్లను నిర్వహించేవారి వ్యాపారాలను సులభతరం చేసింది. రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్‌పోస్టుల వద్ద పొడవైన క్యూలు లేకుండా సరుకులు ఇబ్బందుల్లేకుండా రవాణా అవుతున్నాయి.

ఆర్థికవ్యవస్థకు బూస్ట్

జీఎస్టీ ద్వారా మరిన్ని వ్యాపారాలు పన్ను పరిధిలోకి వచ్చాయి. చిన్న వ్యాపారులు, స్టార్టప్‌లు, ఆన్‌లైన్ విక్రేతలు నిర్దిష్ట టర్నోవర్ పరిమితులను దాటితే ఇప్పుడు జీఎస్టీ కింద నమోదు చేసుకోవాలి. దీనివల్ల వ్యవస్థలో ఎక్కువ పన్ను ఏకీకరణ, మెరుగైన పారదర్శకతకు అవకాశం ఏర్పడింది. తద్వారా క్రమంగా జీఎస్టీ-నమోదిత వ్యాపారాల సంఖ్య పెరిగింది.

బలమైన ఆదాయం

జీఎస్టీ ప్రారంభమైనప్పటి నుంచి వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) భారత ఆదాయ వృద్ధిని గణనీయంగా పెంచింది. పన్ను చెల్లింపుదారుల సంఖ్యను కూడా పెంచింది. ఇది పరోక్ష పన్నులను మరింత పారదర్శకంగా చేస్తూనే దేశ ఆర్థిక ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తూనే వస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ వసూళ్లు రూ. 22.08 లక్షల కోట్ల రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి, ఇది గత సంవత్సరం కంటే 9.4 శాతం అధికమని ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. ఇదే సమయంలో నెలవారీ సగటు వసూళ్లు రూ. 1.84 లక్షల కోట్లుగా, పన్ను చెల్లింపుదారులకు సంబంధించి 2025, ఏప్రిల్ 30 నాటికి 1.51 కోట్లకు పైగా యాక్టివ్ రిజిస్ట్రేషన్లతో కొనసాగుతోంది.

పన్ను చెల్లింపుదారులకు సులభమైన ఫైలింగ్

తొలి నాళ్లలో జీఎస్టీకి సంబంధించి చాలామందిని ఆందోళనకు గురిచేసిన ఒక విషయం డాక్యుమెంట్ పని. కానీ ఈ ఎనిమిదేళ్లలో, జీఎస్టీ ఫైలింగ్ వినియోగదారులకు అనుకూలంగా మారింది. సరళమైన జీఎస్టీ పోర్టల్ నుంచి కొత్త మొబైల్ యాప్‌ల వరకు, పన్ను చెల్లింపుదారులు కొన్ని క్లిక్‌లతో రిటర్న్‌లను దాఖలు చేయడం, ఇన్‌పుట్ క్రెడిట్‌లను ట్రాక్ చేయడం, ఆన్‌లైన్‌లో పన్నులు చెల్లించడానికి వీలవుతోంది.

కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం

కేంద్ర, రాష్ట్రాలను ఏకతాటిపైకి తీసుకురావడం జీఎస్టీ వ్యవస్థ సాధించిన అతిపెద్ద విజయాలలో ఒకటి. కేంద్ర ఆర్థిక మంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్, రేట్లు, సంస్కరణలు, మినహాయింపులపై చర్చించడానికి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్రాలు, కేంద్రం ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటాయి. సమస్యలను కలిసే పరిష్కరిస్తున్నాయి. దీనివల్ల నిజమైన సహకార సమాఖ్యవాదం కొనసాగుతోంది.

Next Story