JP Infra: మనీలాండరింగ్ కేసులో జేపీ ఇన్‌ఫ్రాటెక్ ఎండీ మనోజ్ గౌర్‌ అరెస్ట్

by S Gopi |

భారీ ఆర్థిక అవకతవకలు జరిగాయనే కారణంతో మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ)-2022 కింద కేసు నమోదైంది

JP Infra: మనీలాండరింగ్ కేసులో జేపీ ఇన్‌ఫ్రాటెక్ ఎండీ మనోజ్ గౌర్‌ అరెస్ట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: రూ. 12,000 కోట్ల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జేపీ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ (జేఐఎల్) మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గౌర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇళ్ల కొనుగోలుదారులను మోసం చేసి సొమ్మును దుర్వినియోగం చేశారని, దారి మళ్లించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అధికారుల వివరాల ప్రకారం, జేపీ గ్రూప్ అనుబంధ సంస్థలైన జేపీ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్, జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ (జేఏఎల్)లకు సంబంధించి భారీ ఆర్థిక అవకతవకలు జరిగాయనే కారణంతో మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ)-2022 కింద కేసు నమోదైంది. ఈ కేసు వల్ల ప్రధానంగా కంపెనీ రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెట్టుబడి పెట్టిన వేలాది మంది గృహ కొనుగోలుదారులను ప్రభావితం చేస్తుంది.

అసలు విషయం

గృహ కొనుగోలుదారుల నుంచి పెద్ద ఎత్తున నిరసనల నేపథ్యంలో 2017లో దాఖలైన కేసు ఆధారంగా మనీలాండరింగ్ దర్యాప్తు జరిగింది. జేపీ గ్రూప్‌పై నేరపూరిత కుట్ర, మోసం, ప్రలోభాలకు పాల్పడటం వంటి అభియోగాలు ఉన్నాయి. నివాస ఇళ్ల ప్రాజెక్టుల కోసం పెట్టుబడిదారుల నుంచి సేకరించిన నిధులను దుర్వినియోగం చేశారని లేదా మళ్లించారని ఆరోపిస్తూ ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఫ్లాట్‌లలో చాలావరకు 2010–11 నాటికే అమ్ముడయ్యాయి. కానీ నిర్మాణంలో ఆలస్యం కావడం, నిధుల దుర్వినియోగం కారణంగా పెట్టుబడిదారులు ఏళ్ల తరబడి తమ ఆస్తుల కోసం వేచి చూస్తున్నట్టు బాధితులు ఆరోపించారు.

ఈ ఏడాది మే నెలలో జేపీ ఇన్‌ఫ్రా, జేపీ అసోసియేట్స్ సహా అనుబంధ కంపెనీల్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఢిల్లీ, ముంబై సహా 15 చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 1.7 కోట్ల నగదుతో పాటు కీలక పత్రాలు, డిజిటల్ డేటాను సేకరించినట్టు అధికారులు పేర్కొన్నారు.

Next Story