ARAI: ఈ20 పెట్రోల్‌తో పాత వాహనాల రబ్బరు భాగాలకు ముప్పు?

by S Gopi |

ఈ10 అనుకూల వాహనాల్లో ఈ20 పెట్రోల్ ఎక్కువ కాలం వాడటం వల్ల ఫ్యూయెల్ సిస్టమ్‌లోని హోస్ పైపులు, గాస్కెట్లు, సీల్స్, ఓ-రింగులు లాంటి రబ్బరు భాగాలు త్వరగా అరిగిపోతాయి.

ARAI: ఈ20 పెట్రోల్‌తో పాత వాహనాల రబ్బరు భాగాలకు ముప్పు?
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని 20 శాతానికి (ఈ20) పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, పాత ఈ10 ఇంధన ప్రమాణాల కోసం రూపొందించిన వాహనాలలో ఈ ఈ20 పెట్రోల్ వాడటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' బయటపెట్టిన ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (అరాయ్) రహస్య అధ్యయనంలో తేలింది. ఈ నివేదిక ప్రకారం.. ఈ10 అనుకూల వాహనాల్లో ఈ20 పెట్రోల్ ఎక్కువ కాలం వాడటం వల్ల ఫ్యూయెల్ సిస్టమ్‌లోని హోస్ పైపులు, గాస్కెట్లు, సీల్స్, ఓ-రింగులు లాంటి రబ్బరు భాగాలు త్వరగా అరిగిపోతాయి. ఫలితంగా వాహనదారులు ఈ విడిభాగాలను త్వరగా మార్చాల్సి వస్తుంది. అయితే, ఊరట కలిగించే విషయం ఏంటంటే.. ఈ ఇంధనం వల్ల ఇంజిన్‌లోని మెటల్ భాగాలకు ఎలాంటి నష్టం జరగడం లేదు, అలాగే వాహనాల నుండి వచ్చే ఉద్గారాలు కూడా చట్టపరమైన పరిమితుల్లోనే ఉన్నాయి.

కార్ల ఇంజిన్లపై ప్రభావం

ఈ నివేదికలో కార్ల ఇంజిన్ల మన్నికపై కీలక విషయాలు వెల్లడయ్యాయి. పాత భారత్ స్టేజ్-4 (బీఎస్4) ఇంజిన్ల పనితీరు ఈ20 ఇంధనంతో బాగానే ఉన్నప్పటికీ, ఆధునిక బీఎస్6 టర్బో ఛార్జ్‌డ్ ఇంజిన్లలో మాత్రం 265 గంటల రన్నింగ్ తర్వాత కొన్ని సమస్యలు బయటపడ్డాయి. రెండు ప్రముఖ ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీలు చేసిన వేర్వేరు పరీక్షల్లో భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఒక కంపెనీ ఇంజిన్ 400 గంటల టెస్టింగ్ తర్వాత కూడా సానుకూలంగా పనిచేస్తే, రెండో కంపెనీ ఇంజిన్ 809 గంటలు నడిచేసరికి దానిలోని 'ఎగ్జాస్ట్ వాల్వ్' థర్మోమెకానికల్ దెబ్బతింది. అయితే, ఈ వైఫల్యానికి కేవలం ఈ20 ఇంధనం మాత్రమే కాకుండా ఇతర సాంకేతిక లోపాలు కూడా కారణం కావచ్చునని నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా ఇంజిన్ల పూర్తి మన్నికను పరీక్షించడానికి దాదాపు 2,000 గంటల రన్నింగ్ టైమ్ అవసరమని, కాబట్టి ఈ ఫలితాలను ప్రాథమిక హెచ్చరికలుగానే చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.

బైక్‌లకు రిస్క్ లేదు.. కానీ మైలేజ్ తగ్గొచ్చు

ద్విచక్ర వాహనదారులకు మాత్రం ఈ అధ్యయనం పెద్ద ఉపశమనం కలిగించింది. మూడు ప్రముఖ బైక్ తయారీ సంస్థలు నిర్వహించిన ఇంజిన్ మన్నిక పరీక్షల్లో ఎలాంటి లోపాలు కనిపించలేదు. ఈ20 పెట్రోల్‌తో కూడా ద్విచక్ర వాహనాల ఇంజిన్ల పనితీరు చాలా బాగుందని అరాయ్ స్పష్టం చేసింది. అయితే, కారు అయినా, బైక్ అయినా పాత మోడల్ వాహనాలలో ఈ10 పెట్రోల్‌తో పోలిస్తే ఈ కొత్త ఈ20 పెట్రోల్ వాడినప్పుడు ఇంధన వినియోగం సుమారు 2 శాతం నుండి 6 శాతం వరకు పెరుగుతుందని ఈ నివేదిక తేల్చింది. అంటే, ఇథనాల్ శాతం పెరగడం వల్ల వాహనాల మైలేజ్ స్వల్పంగా తగ్గి, వాహనదారులు పెట్రోల్ కోసం కొంచెం ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు.

Next Story