DPDP Act: మన డిజిటల్ డేటాకు మరింత రక్షణ.. డీపీడీపీ నిబంధనలు నోటిఫై చేసిన కేంద్రం

by S Gopi |

దీనికి సంబంధించి శుక్రవారం ప్రభుత్వం నిబంధనలను విడుదల చేసింది.

DPDP Act: మన డిజిటల్ డేటాకు మరింత రక్షణ.. డీపీడీపీ నిబంధనలు నోటిఫై చేసిన కేంద్రం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత డిజిటల్‌ ప్రపంచంలో సమాచారమే అత్యంత కీలకం. ఒకరి వ్యక్తిగత వివరాలు తెలిస్తే చాలు సైబర్ మోసగాళ్లు బురిడి కొట్టించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. పూర్తిగా డేటాపై ఆధారపడి జీవిస్తున్న ప్రపంచంలో వ్యక్తుల సమాచారానికి ప్రాధాన్యత ఇస్తూ కేంద్రప్రభుత్వం ‘డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ యాక్ట్‌ (డీపీడీపీ)'ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి శుక్రవారం ప్రభుత్వం నిబంధనలను విడుదల చేసింది. ఈ చట్టం చాలా కఠినంగా ఉండనుంది. వ్యక్తిగత సమాచారం లీక్‌ చేసిన కంపెనీలకు ఏకంగా రూ.250 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

తాజాగా నోటిఫై చేసిన నిబంధనల ప్రకారం, దేశంలో 2 కోట్లకు పైగా నమోదిత వినియోగదారులను కలిగి ఉన్న ఈ-కామర్స్ కంపెనీలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, 50 లక్షలకు పైగా నమోదిత వినియోగదారులను కలిగి ఉన్న ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు తమ యూజర్లు మూడేళ్లుగా లాగ్-ఇన్ అవ్వకపోవడం లేదా సేవలను ఉపయోగించకపోతే వారి వ్యక్తిగత డేటాను తొలగించాలని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వారి వ్యక్తిగత డేటా తొలగిస్తున్నట్టుగా కంపెనీలు తమ యూజర్లకు 48 గంటల ముందు సమాచారమివ్వాలి.

కంపెనీలు తాము ఏ డేటాను, ఎందుకు సేకరిస్తారనే విషయాన్ని యూజర్లకు స్పష్టంగా తెలియజేయాలి. స్పష్టమైన అనుమతిని పొందాలి. యూజర్లు ఎప్పుడైనా తమ అనుమతిని ఉపసంహరించుకునే వీలుంటుంది. ఈ అంశంపై ఫిర్యాదు చేయాలనుకుంటే నలుగురు సభ్యులతో న్యూఢిల్లీ కేంద్రంగా ఆన్‌లైన్‌ ద్వారా పనిచేసే డేటా ప్రొటెక్షన్ బోర్డ్ (డీపీబీ)కి ఫిర్యాదు చేయవచ్చు. చట్ట ప్రకారం అవసరమైతే తప్ప, కంపెనీలు ఇకపై అవసరం లేనప్పుడు వ్యక్తిగత డేటాను తొలగించాలి. ఒకవేళ డేటా ఉల్లంఘన జరిగితే, కంపెనీలు యూజర్లకు, డీపీబీకి 72 గంటల్లోపు తెలియజేయాలి. డేటా లీక్ గురించి, దాని ప్రభావంపై వివరణ ఇవ్వాలి. యూజర్లు సురక్షితంగా ఉండటానికి తీసుకోవలసిన చర్యలను వివరించాలి.

Next Story