Telecom: 2 కోట్లకుపైగా మోసపూరిత ఫోన్ కనెక్షన్‌లను బ్లాక్ చేసిన టెలికాం విభాగం

by S Gopi |

దేశంలో సైబర్ భద్రతను మరింత పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.

Telecom: 2 కోట్లకుపైగా మోసపూరిత ఫోన్ కనెక్షన్‌లను బ్లాక్ చేసిన టెలికాం విభాగం
X

దిశ, బిజినెస్ బ్యూరో: మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న 2 కోట్లకు పైగా ఫోన్ కనెక్షన్‌లను టెలికమ్యూనికేషన్ విభాగం (డీఓటీ) బ్లాక్ చేసిందని, సంచార్ సాథి వంటి కార్యక్రమాల ద్వారా స్పూఫ్ కాల్‌లను 97 శాతం తగ్గించగలిగామని డీఓటీ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ తెలిపారు. బుధవారం టెలికాం విభాగం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. దేశంలో సైబర్ భద్రతను మరింత పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఆర్థిక సంస్థలకు సమాచారాన్ని క్రౌడ్‌సోర్స్ చేయడానికి, ఆర్థిక రంగంలో జరుగుతున్న మోసాల గురించి తెలియజేయడానికి డీఓటీ ప్రత్యేకంగా ఓ డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం అన్ని రంగాల్లో టెలికాం పాత్ర కీలకంగా మారింది. సబ్‌స్క్రైబర్ల సంఖ్యతో పాటు మోసాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. దీన్ని నివారించేందుకే డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ అవసరమని భావించాం. ఇది సమాచారం ఆధారంగా సైబర్ సెక్యూరిటీని అందిస్తుంది. తద్వారా సైబర్ మోసాలు లేని సేవలందించేందుకు వీలవుతుందని నీరజ్ మిట్టల్ వెల్లడించారు. దేశంలో సైబర్ భద్రతను మెరుగుపరచడానికి అనేక చర్యలు చేపట్టాం. సర్టిఫైడ్ ఉన్న అధిక నాణ్యత కలిగిన టెలికాం పరికరాలను కొనసాగిస్తూనే, టెలికాం టెస్టింగ్ ల్యాబ్‌లను పెంచుతున్నాం. కృత్రిమ మేధస్సు (ఏఐ) వాడకం ద్వారా 78 లక్షల మోసపూరిత కనెక్షన్‌లను తొలగించామని ఆయన పేర్కొన్నారు.

Next Story