పెళ్లి తర్వాత క్రెడిట్ స్కోర్ మారుతుందా? నిజాలు ఇవే!

by Ramesh Naini |

జీవిత భాగస్వామి క్రెడిట్ స్కోర్ తమపై ప్రభావం చూపుతుందా?’ అని.. చాలామంది పెళ్లి తర్వాత ఇంటి ఖర్చులనో, అవసరాల కోసమో జాయింట్ అకౌంట్స్, జాయింట్ లోన్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. ఈ అంశం గురించి తెలుసుకుందాం.

పెళ్లి తర్వాత క్రెడిట్ స్కోర్ మారుతుందా? నిజాలు ఇవే!
X

దిశ, బిజినెస్ బ్యూరో : ప్రతీది ఆర్థిక వ్యవహారాలతో ముడిపడిన ప్రస్తుత జనరేషన్‌కు క్రెడిట్ స్కోర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉద్యోగం, వ్యాపారం మొదలు పెట్టే ప్రతివారికి దీని అవసరం మరీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో ఎదుగుతున్న క్రమంలో క్రెడిట్ కార్డు కావాలన్నా, గృహ, వ్యక్తిగత, వాహన రుణం ఏది కావాలన్నా క్రెడిట్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే వివాహం తర్వాత అందరినీ ఓ సందేహం వెంటాడుతూ ఉంటుంది. జీవిత భాగస్వామి క్రెడిట్ స్కోర్ తమపై ప్రభావం చూపుతుందా?’ అని.. చాలామంది పెళ్లి తర్వాత ఇంటి ఖర్చులనో, అవసరాల కోసమో జాయింట్ అకౌంట్స్, జాయింట్ లోన్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. అటువంటి సందర్భాల్లో మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ, పెళ్లి అవగానే లైఫ్ పార్ట్‌నర్ క్రెడిట్ హిస్టరీ, స్కోర్ మీపై ప్రభావం చూపుతాయా? ఈ అంశం గురించి తెలుసుకుందాం.

క్రెడిట్ స్కోర్ అంటే?..

ఆర్థిక స్థితిగతులను, రుణం తీర్చే సామర్థ్యాన్ని సూచించేదే క్రెడిట్ స్కోర్. ఇది 300 నుంచి 850 మధ్య ఉండే మూడు అంకెల సంఖ్య. గతంలో మీరు తీసుకున్న రుణాలను లేదా క్రెడిట్ కార్డు బకాయిలను ఎలా చెల్లించారో, గడువులను పాటించారా లేదా అన్న విషయాల ఆధారంగా ఈ స్కోర్ ఉంటుంది. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు మీకు లోన్ ఇవ్వాలా లేదా అన్నది నిర్ణయించేటప్పుడు ఈ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి. మంచి స్కోర్ ఉంటే సులభంగా, తక్కువ వడ్డీతో లభించే అవకాశం ఉంటుంది. క్రెడిట్ స్కోర్‌ 750 కంటే ఎక్కువ ఉంటే, దాన్ని మెరుగైన క్రెడిట్ స్కోర్‌గా పరిగణిస్తారు.

పెళ్లి తర్వాత ఎలా?..

చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే, పెళ్లి అయిన వెంటనే భార్య భర్తల క్రెడిట్ స్కోర్లు కలిసిపోతాయని. కానీ, వాస్తవానికి, ఒక్కో వ్యక్తికి విడివిడిగా క్రెడిట్ హిస్టరీ ఉంటుంది. పెళ్లి అవగానే మీ క్రెడిట్ స్కోర్‌లో మార్పు జరగదు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆర్థిక బాధ్యతలు పంచుకున్నప్పుడు పరిస్థితి మారుతుంది. ఉదాహరణకు, జాయింట్ లోన్ తీసుకోవడం, ఒకే క్రెడిట్ కార్డుకు ఇద్దరూ బాధ్యత వహించడం, ఒకరి లోన్‌కు మరొకరు గ్యారెంటీగా ఉండటం వంటి సందర్భాల్లో సదరు అకౌంట్ మీ ఇద్దరి క్రెడిట్ రిపోర్ట్‌లలో కనిపిస్తుంది. అప్పుడు ఆ అకౌంట్‌ను ఎలా నిర్వహిస్తారో దాని ఆధారంగా ఇద్దరి క్రెడిట్ స్కోర్లు ప్రభావితమవుతాయి. చెల్లింపులు ఆలస్యంగా చేయడం, బకాయిలు ఉంటే ఇద్దరికీ నష్టమే. ముఖ్యంగా కో-సైనింగ్ చేయడం అంటే, ఇద్దరూ కలిసి లోన్ తీసుకున్నట్లైతే, అందుకు సమాన బాధ్యత వహిస్తున్నట్లే. ఒకరు చెల్లించకపోయినా, మరొకరు చెల్లించాల్సిందే. లేదంటే ఇద్దరి క్రెడిట్ రేటింగ్ దెబ్బతింటుంది.

మెరుగైన క్రెడిట్ స్కోర్‌ ఎలా?..

పెళ్లిలో ఆర్థిక వ్యవహారాలు పారదర్శకంగా ఉండటం చాలా ముఖ్యం. ఇద్దరూ ఒకరినొకరు తమ ఆదాయం, ఖర్చులు, అప్పులు, లక్ష్యాలు వంటి విషయాలను స్పష్టంగా పంచుకోవాలి. ఇది భవిష్యత్తులో ఎదురయ్యే అనవసర సమస్యల నుంచి కాపాడుతుంది. ఉమ్మడి ఖాతాలు ఉంటే, వాటికి సంబంధించిన ఈఎంఐలు, బిల్లులు తప్పకుండా గడువులోపు చెల్లించాలి. అవసరమైతే ఆటోమేటిక్ పేమెంట్ సదుపాయాలను ఉపయోగించడం మంచిది. అదేవిధంగా, అవసరం లేని లోన్లు తగ్గించి, ఖర్చులను అదుపులో ఉంచుకోవడం కూడా ముఖ్యమే. ఇలాంటి చిన్నచిన్న అలవాట్లు దీర్ఘకాలంలో మీ క్రెడిట్ హెల్త్‌ని కాపాడుతాయి.

బ్యాంకులు ఎలా అంచనా వేస్తాయి?..

బ్యాంకులు సాధారణంగా ‘5C’స్ ఆఫ్ క్రెడిట్’ అనే ప్రమాణాన్ని అనుసరిస్తాయి. ఇది మీ ఆర్థిక ప్రవర్తనను రకరకాల కోణాల్లో అంచనా వేస్తుంది. క్యారెక్టర్(పేమెంట్ హిస్టరీ), కెపాసిటీ(ఆదాయం, తిరిగి చెల్లించే సామర్థ్యం), క్యాపిటల్(ఆస్తులు, పొదుపులు), కొలెట్రల్(తాకట్టు పెట్టగల ఆస్తులు), కండీషన్స్(రుణానికి సంబంధించిన పరిస్థితులు, నిబంధనలు) ఇవన్నీ కలిపి మీ రుణ అర్హతను నిర్ణయిస్తాయి.

హెచ్చరిక..

వివాహం మీ క్రెడిట్ స్కోర్‌ను నేరుగా ప్రభావితం చేయదు. కానీ, మీరు తీసుకునే ఉమ్మడి ఆర్థిక నిర్ణయాలు మాత్రం ఇద్దరి భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. సరైన అవగాహన, క్రమశిక్షణ, పరస్పర నమ్మకంతో ఆర్థిక వ్యవహారాలను నిర్వహిస్తే, ఇద్దరూ కలిసి పటిష్టమైన క్రెడిట్ ప్రొఫైల్‌ను నిర్మించుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో రుణాలు పొందడం సులభమవుతుంది.

Next Story