RBI: ఈ ఏడాది ప్రథమార్థంలో 99.8 శాతం డిజిటల్ చెల్లింపులే: ఆర్‌బీఐ

by S Gopi |

విలువ పరంగా కూడా డిజిటల్ చెల్లింపుల వాటా 97.7 శాతం ఉన్నట్టు ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

RBI: ఈ ఏడాది ప్రథమార్థంలో 99.8 శాతం డిజిటల్ చెల్లింపులే: ఆర్‌బీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అత్యంత వేగవంతంగా వృద్ధిని సాధిస్తోందని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తెలిపింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో మొత్తం చెల్లింపుల్లో 99.8 శాతం డిజిటల్ చెల్లింపులే ఉన్నాయని గురువారం విడుదల చేసిన డేటాలో పేర్కొంది. విలువ పరంగా కూడా డిజిటల్ చెల్లింపుల వాటా 97.7 శాతం ఉన్నట్టు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. సమీక్షించిన కాలంలో మొత్తం చెల్లింపుల విలువ రూ. 1,572 కోట్లు ఉండగా, ఇందులో రూ. 1,536 కోట్లు డిజిటల్ చెల్లింపులు ఉన్నాయి.

యూపీఐ వర్సెస్ ఆర్‌టీజీఎస్

2025 ప్రథమార్థంలో యూపీఐ లావాదేవీలు 85 శాతం వాటాతో అతిపెద్ద వాటాను కలిగి ఉన్నాయి. అయితే విలువ పరంగా లావాదేవీలలో దాని వాటా 9 శాతం మాత్రమే. ఇదే సమయంలో రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్‌టీజీఎస్) వ్యవస్థ విలువ పరంగా 69 శాతం వాటాను నమోదు చేశాయి. అయితే ఇవి వాల్యూమ్ పరంగా అత్యల్ప వాటా 0.1 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

మనదేశంలో అధిక-విలువ చెల్లింపు వ్యవస్థ అయిన ఆర్‌టీజీఎస్ 2019లో 14.8 కోట్ల నుంచి 2024లో 29.5 కోట్లకు వాల్యూమ్ వృద్ధిని నమోదు చేసింది. అయితే ఇదే సమయంలో లావాదేవీ విలువ రూ. 1,388.7 లక్షల కోట్ల నుంచి రూ. 1,938.2 లక్షల కోట్లకు పెరిగింది. 2025 మొదటి ఆరు నెలల్లో ఆర్‌టీజీఎస్ 16.1 కోట్ల లావాదేవీలను నమోదు చేయగా, వీటి మొత్తం విలువ రూ. 1,079.2 లక్షల కోట్లుగా ఉన్నాయి.

యూపీఐ వ్యవస్థ చాలా పెద్ద సంఖ్యలో చిన్న-విలువ లావాదేవీలను ప్రాసెస్ చేస్తుంది. అందుకే వాల్యూమ్ పరంగా అధిక వాటా కలిగి ఉన్నప్పటికీ, కానీ విలువ పరంగా తక్కువ వాటా ఉంటుంది. ఆర్‌టీజీఎస్ కనీస లావాదేవీ మొత్తం రూ. 2 లక్షల కావడంతో విలువ పరంగా అధిక వాటాను కలిగి ఉంటుంది.

Next Story