DigiLocker App: నకిలీ 'డిజిలాకర్ యాప్‌'తో జాగ్రత్త

by S Gopi |

డిజిలాకర్‌కు నకిలీ యాప్ రూపొందించి సామాన్యుల వ్యక్తిగత డేటాను దొంగలిస్తున్నట్టు తేలడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

DigiLocker App: నకిలీ డిజిలాకర్ యాప్‌తో జాగ్రత్త
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం రోజువారీ జీవితంలో డిజిటల్ సేవలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా నకిలీ యాప్‌లను గుర్తించడం కూడా కష్టంగా మారిన పరిస్థితుల్లో ఉన్నాం. మొబైల్ వాడకం సాధారణమైపోయిన కాలంలో ప్రతి అవసరానికి ఒక యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడం అలవాటుగా మారింది. ఇది ఆర్థికపరమైన విషయాల్లోనే కాదు ఇతర అవసరాల కోసం ఉద్దేశించిన పలు యాప్‌లను కూడా స్కామర్లు టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారిక వెబ్‌సైట్‌ల నుంచి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని, సందేహం వచ్చిన ఎటువంటి లింక్‌లను కూడా క్లిక్ చేయవద్దని టెక్ నిపుణులు, సైబర్ విభాగం అధికారులూ హెచ్చరిస్తున్నారు. ఇటీవల అందరి డిజిటల్ డేటాకు కీలకమైన డిజిలాకర్ యాప్‌పై కూడా సైబర్ మోసగాళ్లు కన్నేసినట్టు తెలుస్తోంది. డిజిటల్‌గా కీలకమైన డాక్యుమెంట్లను స్టోర్ చేసుకునేందుకు ఉన్న డిజిలాకర్‌కు నకిలీ యాప్ రూపొందించి సామాన్యుల వ్యక్తిగత డేటాను దొంగలిస్తున్నట్టు తేలడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

ప్రభుత్వం హెచ్చరిక

ఇటీవల భారత ప్రభుత్వం వినియోగదారులను మోసం చేయడానికి ఉపయోగించే నకిలీ డిజిలాకర్ యాప్‌ల గురించి అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. సైబర్ మోసగాళ్ళు సున్నితమైన కస్టమర్ డేటాను ఆసరాగా చేసుకుంటున్నట్టు స్పష్టం చేసింది. దేశీయంగా ఒక్కటే డిజిలాకర్ యాప్ ఉంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ-గవర్నెన్స్ విభాగం ద్వారా పనిచేస్తుంది. కాబట్టి డిజిలాకర్ పేరుతో నకిలీ గుర్తులు, యాప్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారిక ప్రకటనలో పేర్కొంది. యాప్‌లను డౌన్‌లోడ్ చేయడానికి ముందు ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయాలని, ఇతరులకు కూడా ఈ విషయాన్ని చేరవేసి సురక్షితంగా ఉండమని చెప్పాలని సూచించింది.

కొన్ని నకిలీ యాప్‌లు ‘డిజిలాకర్‌’ మాదిరి కనిపించేలా రూపొందించి వ్యక్తిగత పత్రాలు, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నాలు చేస్తున్నాయని సైబర్‌ నిపుణులు తెలిపారు. డిజిలాకర్‌ పేరుతో ఉండే అనధికార యాప్‌లను డౌన్‌లోడ్‌ చేస్తే.. పర్సనల్ డాక్యుమెంట్లు, బ్యాంకు వివరాలు, ఆధార్‌ సంబంధిత సమాచారం లీక్‌ అయ్యే ప్రమాదం ఉంది. ఈ మోసపూరిత యాప్‌ల ద్వారా స్కామర్లు మాల్‌వేర్‌ను వాడి ఫోన్లలోకి చొరబడే అవకాశం ఉంది. ఆపై పాస్‌వర్డ్స్‌, ఓటీపీ లాంటి కీలక సమాచారాన్ని చోరీ చేయవచ్చు.

ఎలా నివారించాలి

వినియోగదారులు డిజిలాకర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు డెవలపర్ ఎవరనే సమాచారాన్ని వెతకాలని ప్రభుత్వం తెలిపింది. నిజమైన డిజిలాకర్ యాప్ 'నేషనల్ ఈ-గవర్నెన్స్ విభాగం, భారత ప్రభుత్వం' అందిస్తుంది.

ఈ స్కామ్ నుంచి రక్షణకు కొన్ని జాగ్రత్తలు. అవేంటంటే..

* డెవలపర్ పేరు: చట్టబద్ధమైన డిజిలాకర్ యాప్ భారత ప్రభుత్వంలోని నేషనల్ ఈ-గవర్నెన్స్ విభాగం అందిస్తున్నదని నిర్ధారించుకోవాలి. ఏదైనా నంబర్ నుంచి ఫార్వార్డ్ అయిన లింక్‌లపై క్లిక్ చేయకుండా ఉండటం మంచిది.

* యాప్‌ లింక్స్‌: ఏదైనా వెబ్‌సైట్ లేదా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కనిపించే యాడ్స్ ద్వారా వచ్చే యాప్‌ లింక్స్‌ క్లిక్‌ చేయకూడదు.

* యాప్ పర్మిషన్స్, రివ్యూలు: ఎక్కువ పర్మిషన్ రిక్వెస్ట్‌లు లేదా ప్రతికూల యాప్ స్టోర్ ఫీడ్‌బ్యాక్ ఉందంటే అది స్పష్టంగా రిస్క్ ఉందని సూచన. యాప్‌ డౌన్‌లోడ్‌ చేయడానికి ముందు రేటింగ్స్‌, రివ్యూలు చూడాలి.

* ఫార్వార్డ్ చేసిన ఏపీకే లింక్‌లు లేదా ఒకేలా కనిపించే పేర్లతో ఉన్న యాప్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Next Story