ఈ విషయం తెలుసా.. ఆసియాలోనే అతి పెద్ద మామిడి తోట మన అంబానీ మామదే!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-11 06:32:24  IST  )

పండ్లలో రారాజు మామిడి. ఇక వేసవి కాలం వస్తూనే.. మామిడి సీజన్‌ను కూడా తీసుకువచ్చింది.

ఈ విషయం తెలుసా.. ఆసియాలోనే అతి పెద్ద మామిడి తోట మన అంబానీ మామదే!
X

దిశ, వెబ్ డెస్క్: పండ్లలో రారాజు మామిడి (Mangoes). ఇక వేసవి కాలం వస్తూనే.. మామిడి సీజన్‌ను కూడా తీసుకువచ్చింది. ఈ సందర్భంగా దేశంలోనే అత్యంత ధనవంతుడు ముకేష్ అంబానీ (Mukesh ambani) గురించి ఓ ఆసక్తికరమైన ఈ విషయం చెప్పాలి. సాధారణంగా అంబానీ పేరు చెప్పగానే మనకు ముందుగా రిలయన్స్ (Reliance) ఇండస్ట్రీస్ గుర్తుకు వస్తుంది. కానీ, ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారు కూడా మన అంబానీ మామనే. 200 రకాల మామిడి పండ్లతో ఆరు వందల ఎకరాల్లో 'ధీరూభాయ్‌ అంబానీ లఖీబాగ్‌ అమ్రాయీ (Dhirubhai Ambani Lakhi Bagh Amrai)' పేరుతో అంబానీకి మామిడి తోట ఉంది. ఇది ఆసియాలోనే అతిపెద్దదైన మామిడి తోటగా ప్రసిద్ధి చెందింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

1997లో అంబానీ రిలయన్స్ సంస్థకు ఓ పెద్ద చిక్కు వచ్చి పడింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న చమురు శుద్ధి కర్మాగారం వల్ల కాలుష్యం సమస్య ఏర్పడింది. దీంతో కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలకు తగినట్లుగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి తప్పలేదు. అందుకోసం రిలయన్స్‌ యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. 'ధీరూభాయ్‌ అంబానీ లఖీబాగ్‌ అమ్రాయీ' పేరుతో 600 ఎకరాల్లో సుమారు లక్షా ముప్పై వేలకు పైగా మామిడి చెట్లతో తోటను ఏర్పాటు చేసింది. ఈ తోట ఉన్న ప్రాంతం ఒకప్పుడు బీడు భూమి. దాన్ని అలాగే వదిలేయకుండా మామిడితోటగా మార్చింది రిలయన్స్‌ సంస్థ. అది ఇప్పుడు ఆసియాలనే అతి పెద్ద మామిడి తోట రికార్డు సృష్టించింది.

ఇక ఇక్కడ దొరికే మామిడి వెరైటీల్లో కేసర్, ఆల్ఫోన్సో, రత్న, సింధు, నీలమ్, ఆమ్రపాలి వంటి దేశీయ రకాలే కాకుండా.. టామీ అట్కిన్స్, కెంట్, లిలీ, మాయా.. వంటి విదేశీరకాలూ ఉంటాయి. ఈ తోటలో దాదాపు 500 మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. ఈ తోటలో డీశాలినేషన్, డ్రిప్‌ ఇరిగేషన్, ఫెర్టిగేషన్, వాటర్‌ హార్వెస్టింగ్‌.. వంటి ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని అవలంబిస్తారు. అందుకే ప్రతి ఏటా 600 టన్నుల కంటే ఎక్కువ అధిక నాణ్యత కలిగిన మామిడి పళ్ళు ఉత్పత్తి అవుతాయి. అంతేకాదు, ఈ తోట ఇప్పుడు ఎంతోమంది రైతులకు, శాస్త్రవేత్తలకూ పరిశోధన క్షేత్రంగానూ పేరుపొందింది. ఇక ఈ మామిడితోటను నీతా అంబానీ స్వయంగా పర్యవేక్షించడం గమనార్హం.

Next Story