DGCA: ఎయిర్ ఇండియాకు సమన్లు జారీ చేసిన డీజీసీఏ

by S Gopi |

ప్రమాదానికి ముందు నియంత్రణాపరమైన అంశాలపై సమీక్షలో భాగంగా వివరాలు కోరినట్టు డీజీసీఏ తెలిపింది.

DGCA: ఎయిర్ ఇండియాకు సమన్లు జారీ చేసిన డీజీసీఏ
X

దిశ, బిజినెస్ బ్యూరో: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో భారత విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) మంగళవారం అత్యవసర సమావేశానికి ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఉన్నతాధికారులను పిలిపించింది. డైరెక్టర్ జనరల్ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ అధ్యక్షతన వర్చువల్‌గా నిర్వహించిన ఈ సమావేశంలో గత వారం కూలిపోయిన విమాన పైలట్లు, డిస్పాచర్ శిక్షణ రికార్డులను సమర్పించాలని ఎయిర్ ఇండియాను కోరింది. ప్రమాదానికి ముందు నియంత్రణాపరమైన అంశాలపై సమీక్షలో భాగంగా వివరాలు కోరినట్టు డీజీసీఏ తెలిపింది. గత కొన్ని నెలలుగా ఎయిర్ ఇండియాపై జరిగిన ఆడిట్‌ల తర్వాత తీసుకున్న చర్యల వివరాలను కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది. సోమవారం నాటికి ఆయా వివరాలను అందించాలని పేర్కొంది. సమన్లు ​​పొందిన వారిలో ఎయిర్ ఇండియా ఎండీ, సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్, ఫ్లైట్ ఆపరేషన్స్ డైరెక్టర్ కెప్టెన్ పంకుల్ మాథుర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సీఈఓ అలోక్ సింగ్, ఎయిర్‌లైన్ కార్యకలాపాలు, భద్రతా సమ్మతికి బాధ్యత వహించే ఇతర కీలక పోస్ట్‌హోల్డర్లు ఉన్నారు.

ఫ్లయింగ్ స్కూల్స్‌కు ఆదేశాలు

ఇదే సమయంలో దేశంలోని అన్ని ఫ్లయింగ్ స్కూల్స్‌కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఆమోదం ఉన్న శిక్షణా విధానాలు, భద్రతా ప్రోటోకాల్స్‌కు అనుగుణంగా ఉన్నాయో లేదో తిరిగి ధృవీకరించాలని డీజీసీఏ తెలిపింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా అన్ని ఆదేశాలను పాటించిందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. పైలట్‌ల శిక్షణ వివరాలు, సంబంధిత పత్రాలను, విమాన డిస్పాచర్‌ను అడగడం సజజంగా ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో కోరడం సాధారణం. అయితే, తాజా డీజీసీఏ మెమోలో ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాలనే దానిపై వివరణ లేదు. కానీ ప్రమాదం గురించి దర్యాప్తు చేసే సందర్భంలో సాధారణంగా సిబ్బంది శిక్షణ, అర్హతలు, ఫ్లైట్ హిస్టరీ, వైద్య రికార్డులు, వారిపై గతంలో తీసుకున్న ఏవైనా చర్యలను పరిశీలిస్తారు.

Next Story