Reliance Infra: డస్సాల్ట్‌తో కలిసి రిలయన్స్ ఇన్‌ఫ్రా ఫాల్కన్-2000 బిజినెస్ జెట్ల తయారీ

by S Gopi |

డస్సాల్ట్ తన ఫాల్కన్ విమానాలను ఫ్రాన్స్ వెలుపల అసెంబుల్ చేయనుండటం ఇదే మొదటిసారి.

Reliance Infra: డస్సాల్ట్‌తో కలిసి రిలయన్స్ ఇన్‌ఫ్రా ఫాల్కన్-2000 బిజినెస్ జెట్ల తయారీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: అనిల్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బుధవారం ఫ్రెంచ్ విమానాల తయారీ సంస్థ డస్సాల్ట్ ఏవియేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇరు సంస్థల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా రిలయన్స్ ఇన్‌ఫ్రా అనుబంధ రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్ భారత్‌లో ఫాల్కన్ 2000 బిజినెస్ జెట్‌లను తయారు చేయనున్నట్టు ప్రకటించింది. డస్సాల్ట్ తన ఫాల్కన్ విమానాలను ఫ్రాన్స్ వెలుపల అసెంబుల్ చేయనుండటం ఇదే మొదటిసారి. అంతేకాకుండా భారత్ ఇప్పుడు యూఎస్, ఫ్రాన్స్, కెనడా, బ్రెజిల్‌ల జాబితాలో ప్రపంచ మార్కెట్ల కోసం వ్యాపార జెట్‌లను తయారు చేసే ప్రత్యేక దేశాల సరసన చేరింది. మొట్టమొదటి 'మేడ్ ఇన్ ఇండియా' ఫాల్కన్ 2000 జెట్ 2028 నాటికి అందుబాటులోకి వస్తుంది. ఇది కార్పొరేట్, సైనిక అవసరాలకు వాడనున్నారు. ఈ జెట్లు మార్కెట్లోకి వచ్చిన తర్వాత భారతీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ పెరుగుతున్న డిమాండ్‌ను తీరుస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉన్న భారత్ దేశీయ ఉత్పత్తిని పెంచాలని చూస్తోంది. అంతర్జాతీయ సంస్థలు కూడా భారత్‌లో ఉత్పత్తి చేయడానికి ముందుకు వస్తున్నాయి. కొన్ని సంస్థలు స్వంతంగానే తయారీకి ఆసక్తి చూపిస్తుండగా, మరికొన్ని భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాయి. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి భారత్ రూ. 23.85 వేల కోట్ల విలువైన రక్షణ ఎగుమతులు చేసింది. ఇది గతేడాది కంటే 12 శాతం అధికం. డసాల్ట్‌తో ఒప్పందం కారణంగా బుధవారం రిలయన్స్ ఇన్‌ఫ్రా షేర్లు 5 శాతం పెరిగి రూ.386.05 వద్ద ట్రేడయ్యాయి.

Next Story