Credit Card: తగ్గిన క్రెడిట్ కార్డ్ చెల్లింపులు

by S Gopi |

విలువ పరంగా క్రెడిట్ కార్డు ఖర్చులు రూ. 2.05 లక్షల కోట్లుగా ఉన్నాయి.

Credit Card: తగ్గిన క్రెడిట్ కార్డ్ చెల్లింపులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: పండగ సీజన్‌ ముగియడంతో క్రెడిట్‌ కార్డు ద్వారా చేస్తున్న ఖర్చులు తగ్గుముఖం పట్టాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తాజా గణాంకాల ప్రకారం, గతేడాది డిసెంబర్‌లో క్రెడిట్ కార్డు ఖర్చులు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 8.9 శాతం తగ్గింది. విలువ పరంగా క్రెడిట్ కార్డు ఖర్చులు రూ. 2.05 లక్షల కోట్లుగా ఉన్నాయి. అయితే, నెలవారీ ప్రాతిపదికన నవంబర్‌లో కంటే వీటి ఖర్చులు 8.4 శాతం పెరిగాయి. ఖర్చులు ఎక్కువగానే ఉన్నప్పటికీ, క్రెడిట్ కార్డుల వాడకం తక్కువగా ఉందని ఆర్‌బీఐ డేటా సూచిస్తోంది. నెలవారీగా పెరిగేందుకు ఈ-కామర్స్ కార్యకలాపాలు, అధిక ప్రయాణ గిరాకీ దోహదపడ్డాయి. డిసెంబర్ నెలలో ఒక్కో క్రెడిట్ కార్డు నెలవారీ సగటు ఖర్చు 8 శాతం పెరిగి రూ. 17,712కి పెరిగింది. ఇక, క్రెడిట్ కార్డుల విస్తరణ స్థిరంగా కొనసాగుతోంది. డిసెంబర్ నాటికి క్రెడిట్ కార్డుల సంఖ్య 11.6 కోట్లకు పెరిగింది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో 10.8 కోట్లు ఉన్నాయి. మొత్తం క్రెడిట్ కార్డ్ ఖర్చుల్లో ప్రైవేట్ రంగ బ్యాంకులు 72.5 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అయితే, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ వాటా 3.75 శాతం తగ్గింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం ఖర్చుల వాటాను 17.7 శాతం నుంచి 22.2 శాతానికి పెంచుకున్నాయి.

Next Story