CoinDCX: పోయిన సొమ్ము తెచ్చిస్తే 25 శాతం రివార్డు

by S Gopi |

పోయిన సొమ్మును రికవరీ కోసం సహకారం అందించిన వారికి అందులో 25 శాతం రివార్డు ఇవ్వనున్నట్టు పేర్కొంది.

CoinDCX: పోయిన సొమ్ము తెచ్చిస్తే 25 శాతం రివార్డు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ సంస్థ కాయిన్‌డీసీఎక్స్ కీలక ప్రకటన విడుదల చేసింది. గత వారం కంపెనీపై జరిగిన సైబర్ దాడిలో 44.2 మిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 381 కోట్లు) చోరీకి గురైంది. దీంతో ఆ సొమ్ము తిరిగి పొందేందుకు కంపెనీ బౌంటీ ప్రోగ్రామ్‌ను సోమవారం ప్రకటించింది. పోయిన సొమ్మును రికవరీ కోసం సహకారం అందించిన వారికి అందులో 25 శాతం రివార్డు ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఇందులో భాగంగా సైబర్ క్రైమ్‌పై పోరాటానికి వెబ్3 కమ్యూనిటీ ముందు రావాలని, తమ సొమ్ము రికవరీ కోసం సాయమందించాలని వైట్-హ్యాట్ రీసెర్చర్లు, ఎథికల్ హ్యాకర్లను కోరింది. దొంగిలించిన తమ క్రిప్టోకరెన్సీని తిరిగి పొందడంలో సాయం చేసేవారు, సైబర్ మోసగాళ్లను గుర్తించడంలో, దోషులుగా నిర్ధారించడంలో సహాయపడే పార్ట్‌నర్‌లకు 25 శాతం వరకు ఇస్తామని స్పష్టం చేసింది. కాగా, జూలై 19న కాయిన్‌డీసీఎక్ సెక్యూరిటీ సిస్టమ్స్ పార్ట్‌నర్ ఎక్స్ఛేంజ్‌లోని దాని ఖాతాలలో ఒకదాంట్లో అనధికారిక యాక్సెస్‌ లభించినట్టు గుర్తించింది. దానివల్ల సుమారు రూ. 380 కోట్లకు పైనే నష్టం ఏర్పడిందని, కస్టమర్ల సొమ్ము భద్రంగా ఉన్నట్టు కంపెనీ కో-ఫౌండర్లు నీరజ్ ఖండేల్‌వాల్, సుమిత్ గుప్తా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. జరిగిన నష్టాన్ని కంపెనీయే భరిస్తుందని, సంస్థ అంతర్గత నిధుల ద్వారా దీన్ని భర్తీ చేయనున్నట్టు వారు వెల్లడించారు.

Next Story