Bhavya Scheme: దేశవ్యాప్తంగా 100 ఇండస్ట్రియల్ పార్కులు

by S Gopi |

రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్లగ్-అండ్-ప్లే మోడల్‌లో ఈ పార్కులను అభివృద్ధి చేయనున్నారు.

Bhavya Scheme: దేశవ్యాప్తంగా 100 ఇండస్ట్రియల్ పార్కులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం దేశంలో తయారీ రంగాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేయడానికి ‘భవ్య’ (భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన) పేరుతో భారీ పారిశ్రామిక పార్కుల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 100 ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఈ పథకానికి కేంద్రం రూ.33,660 కోట్ల నిధులను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్లగ్-అండ్-ప్లే మోడల్‌లో ఈ పార్కులను అభివృద్ధి చేయనున్నారు. అంటే, పరిశ్రమలు వెంటనే కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన భూమి, రోడ్లు, విద్యుత్, నీరు, గిడ్డంగులు వంటి సదుపాయాలు ముందుగానే సిద్ధంగా ఉంటాయి. ఈ పథకం మొదటి దశలో 20 ఇండస్ట్రియల్ పార్కుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తారు. ఆ తర్వాత మరో 30 పార్కులను ఎంపిక చేసి, మిగిలిన 50 పార్కులను తదుపరి దశలో అభివృద్ధి చేయనున్నారు. ఒక్కో పార్క్ 100 నుంచి 1,000 ఎకరాల విస్తీర్ణంలో ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగ కంపెనీల సంయుక్త భాగస్వామ్యంతో ఈ పథకం అమలవుతుందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు.

ఈ పారిశ్రామిక పార్కులు కేవలం పరిశ్రమలకే పరిమితం కాకుండా.. పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టి, సరఫరా గొలుసుల బలోపేతానికి కూడా దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా తయారీదారులు, సరఫరాదారులు, సేవా సంస్థలు ఒకేచోట ఉండేలా క్లస్టర్ మోడల్‌లో ఈ పార్కులు అభివృద్ధి అవుతాయి. దీంతో లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గడంతో పాటు, ఉత్పత్తి సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఈ పథకంపై ఆసక్తి చూపినట్లు కేంద్రం వెల్లడించింది.

Next Story