Exporters: ఎగుమతిదారులకు కేంద్రం భరోసా

by S Gopi |

వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే 20 దేశాలపై దృష్టి సారించింది, కొత్తగా మరో 30 దేశాలను ఇందులో చేర్చారు.

Exporters: ఎగుమతిదారులకు కేంద్రం భరోసా
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఎగుమతులను పెంచే చర్యలపై ప్రభుత్వం కృషి చేస్తోంది. అమెరికా ప్రభుత్వం భారత వస్తువులపై విధించిన భారీ సుంకాల నేపథ్యంలో మధ్యప్రాచ్యం, ఆఫ్రికా వంటి ప్రాంతాలలోని 50 దేశాలను లక్ష్యంగా చేసుకుని ఎగుమతులను పెంచే దిశగా చర్యలు తీసుకుంటోందని సోమవారం ఓ అధికారి తెలిపారు. ఈ 50 దేశాలు భారత ఎగుమతుల్లో దాదాపు 90 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఎగుమతి ఎక్కువ మార్కెట్లకు విస్తరించడం, దిగుమతులకు ప్రత్యామ్నాయం వెతుక్కోవడం, ఎగుమతుల్లో మరింత పోటీ పడటం వంటి కీలక నాలుగు అంశాలపై వాణిజ్య మంత్రిత్వ శాఖ పనిచేస్తోందని అధికారి తెలిపారు. ఈ అంశాలపై సమీక్ష జరుగుతోంది. మంత్రిత్వ శాఖ ఒక్కో ఉత్పత్తిని క్షుణ్ణంగా పరిశీలిస్తోందని తెలిపారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే 20 దేశాలపై దృష్టి సారించింది, కొత్తగా మరో 30 దేశాలను ఇందులో చేర్చారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల కారణంగా జూన్‌లో భారత ఎగుమతులు 35.14 బిలియన్ డాలర్లతో స్థిరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే వాణిజ్య లోటు ఈ నెలలో నాలుగు నెలల కనిష్ట స్థాయికి తగ్గింది.

బ్యాంకులకు 10-15 శాతం క్రెడిట్ గ్యారెంటీ

ఇదే సమయంలో అమెరికా విధించిన అధిక సుంకాల నుంచి చిన్న సంస్థలు, ఎగుమతిదారులకు 90 రోజుల గడువు ముగిసిన రుణాలకు క్రెడిట్ గ్యారెంటీలను అందించాలని ప్రభుత్వం భావిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) స్పెషల్ మెన్షన్ అకౌంట్స్ (ఎస్ఎమే)గా పరిగణించే రూ. 500 కోట్ల వరకు టర్నోవర్‌తో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న చిన్న వ్యాపారాలకు రుణాలు ముందస్తుగా ఇవ్వడానికి బ్యాంకులకు 10-15 శాతం క్రెడిట్ గ్యారెంటీలను అందించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దేశంలోని అనేక చిన్న సంస్థలు ఇప్పటికీ సకాలంలో, నామమాత్రం క్రెడిట్‌ కూడా పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత పరిణామాల మధ్య బ్యాంకులకు హామీలు అందించడానికి ప్రభుత్వం దాదాపు రూ. 4,000 కోట్ల వరకు కేటాయించవచ్చని సమాచారం. భారత ఎగుమతులకు కీలకమైన అమెరికా మార్కెట్ అధిక సుంకాల కారణంగా అనిశ్చితిని ఎదుర్కొంటున్న చిన్న ఎగుమతిదారులను ఈ నిధులు కవర్ చేస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

రొయ్యలు, చేపల రవాణాకు ప్రత్యామ్నాయం

మరోవైపు, సీఫుడ్ ఎగుమతిదారులకు కూడా కేంద్ర ప్రభుత్వం సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. అమెరికా సుంకాల వల్ల ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని, రొయ్యలు, ఇతర చేపల రకాల రవాణాకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషించాలని కోరింది. విలేకరుల సమావేశంలో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ మాట్లాడుతూ.. దేశ సముద్ర ఆహార ఎగుమతులకు ప్రత్యామ్నాయ మార్కెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈయూ, జపాన్, దక్షిణ కొరియా, యూకే, రష్యా, ఆస్ట్రేలియా, పశ్చిమ ఆసియా, ఆగ్నేయాసియా సహా అనేక దేశాలు భారతీయ సముద్ర ఆహార ఎగుమతులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇతర మార్కెట్లకు చేరే ముందు విలువను, ప్యాకేజింగ్‌ను మెరుగుపరచాల్సిన అవసరాన్ని మంత్రి ప్రస్తావించారు. విలువ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేయడానికి, బలోపేతం చేయడానికి మత్స్య మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధిని సద్వినియోగం చేసుకోవాలని రంజన్ సింగ్ ఎగుమతిదారులను కోరారు.

Next Story