గ్యాస్ కొరత.. 10 కేజీల ఎల్పీజీ సిలిండర్ల వార్తలపై స్పందించిన కేంద్రం

by Naga Rani Yarlagadda |

10 కేజీల ఎల్పీజీ సిలిండర్ల వార్తలపై కేంద్రం స్పందించింది. 14 కేజీల సిలిండర్లకు బదులు 10 కేజీల సిలిండర్ల సప్లై చేయడంపై క్లారిటీ ఇచ్చింది.

గ్యాస్ కొరత.. 10 కేజీల ఎల్పీజీ సిలిండర్ల వార్తలపై స్పందించిన కేంద్రం
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది గంటలుగా సోషల్ మీడియా, కొన్ని జాతీయ మీడియా సంస్థల్లో చక్కర్లు కొడుతున్న ఎల్‌పీజీ సిలిండర్ల బరువు తగ్గింపు (LPG Crisis) వార్తలకు కేంద్ర ప్రభుత్వం ముగింపు పలికింది. గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్ పరిమాణాన్ని 14.2 కిలోల నుంచి 10 కిలోలకు కుదిస్తున్నారనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఈ అంశంపై పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ అధికారికంగా వివరణ ఇచ్చారు. సిలిండర్ బరువు తగ్గింపుపై వస్తున్న కథనాలన్నీ కేవలం అంచనాలు, ఊహాగానాలేనని ఆమె తేల్చి చెప్పారు. పాత సిలిండర్లలోనే తక్కువ గ్యాస్ నింపి సరఫరా చేస్తారనే వార్తలను నమ్మవద్దని సూచించారు.

పశ్చిమాసియా (West Asia) ప్రాంతంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఇతర రాజకీయ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా వంటగ్యాస్ సరఫరాకు ఆటంకం ఏర్పడవచ్చని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో, దేశీయంగా గ్యాస్ కొరత రాకుండా చూసేందుకు చమురు సంస్థలు (Oil Companies) ఒక వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నాయని, అందులో భాగంగానే సిలిండర్ బరువును 10 కిలోలకు తగ్గించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది.

వినియోగదారులపై ప్రభావం ఉండదు

సాధారణంగా ఒక కుటుంబానికి 14.2 కేజీల సిలిండర్ సుమారు 40 రోజుల వరకు వస్తుంది. ఒకవేళ అది 10 కేజీలకు తగ్గితే నెల రోజుల్లోపే అయిపోయే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. అయితే, ఈ మార్పుల వల్ల అందరికీ గ్యాస్ అందేలా చూడవచ్చని కొన్ని కథనాలు పేర్కొన్నాయి. తాజాగా కేంద్రం ఇచ్చిన క్లారిటీతో ఈ గందరగోళానికి తెరపడింది. ప్రస్తుతానికి పాత పద్ధతిలోనే 14.2 కిలోల సిలిండర్ల పంపిణీ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Next Story