Central Banks: సెంట్రల్ బ్యాంకుల 'బంగారు' వ్యూహం

by S Gopi |

89 శాతం మంది రిజర్వ్ మేనేజర్లు రాబోయే 12 నెలల్లో కేంద్ర బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తాయని స్పష్టం చేశారు.

Central Banks: సెంట్రల్ బ్యాంకుల బంగారు వ్యూహం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ సెంట్రల్ బ్యాంకులు తమ వ్యూహాన్ని మార్చాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తాజాగా విడుదల చేసిన 'సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ రిజర్వ్స్ సర్వే' ప్రకారం, రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బంగారు నిల్వలు భారీగా పెరగనున్నాయి. సర్వేలో పాల్గొన్న 89 శాతం మంది రిజర్వ్ మేనేజర్లు రాబోయే 12 నెలల్లో కేంద్ర బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తాయని స్పష్టం చేశారు. అమెరికా డాలర్ తర్వాత ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన రెండో పెట్టుబడి సాధనంగా ఇప్పటివరకు అమెరికా ప్రభుత్వ బాండ్లు ఉండేవి. అయితే, ఇప్పుడు బంగారం ఆ బాండ్లను కూడా అధిగమించి రెండో స్థానానికి చేరడం ప్రపంచ ఆర్థికవ్యవస్థలో కీలక మార్పుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.

డాలర్ ఆధిపత్యానికి బ్రేకులు

ఈ సర్వే చరిత్రలోనే మొదటిసారిగా.. రికార్డు స్థాయిలో 45 శాతం మంది రిజర్వ్ మేనేజర్లు రాబోయే ఏడాదిలో తమ సొంత బ్యాంకుల పసిడి నిల్వలను మరింత పెంచుకోనున్నట్లు ప్రకటించారు. ఇది గతేడాది 76 శాతం ఉంటే, ఇప్పుడు అది 83 శాతానికి చేరింది. అదే సమయంలో, తమ వద్ద ప్రస్తుతం బంగారు నిల్వలు ఉన్నాయని చెప్పిన బ్యాంకుల సంఖ్య 81 శాతం నుంచి ఏకంగా 93 శాతానికి పెరిగింది. మరోవైపు, దశాబ్దాలుగా నడుస్తున్న అమెరికా డాలర్ ఆధిపత్యంపై కేంద్ర బ్యాంకుల్లో నమ్మకం క్రమంగా సడలుతోంది. రాబోయే ఐదేళ్లలో అంతర్జాతీయ రిజర్వులలో అమెరికా డాలర్ వాటా గణనీయంగా పడిపోతుందని దాదాపు 74 శాతం మంది రిజర్వ్ మేనేజర్లు అంచనా వేయడం గమనార్హం.

వ్యాపార వ్యూహం

ఆర్థిక, రాజకీయ సంక్షోభ సమయాల్లో బంగారం కనబరిచే స్థిరత్వమే దాని డిమాండ్‌కు ప్రధాన కారణం. సర్వేలో పాల్గొన్న వారిలో 90 శాతం మంది అత్యవసర పరిస్థితుల్లో బంగారం నమ్మకమైన ఆస్తిగా నిలుస్తుందని చెబుతుండగా, 84 శాతం మంది దీర్ఘకాలిక విలువను, 82 శాతం మంది పోర్ట్‌ఫోలియో రిస్క్ తగ్గించుకునే ప్రయోజనాలను పేర్కొన్నారు. ముఖ్యంగా వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న దేశాల సెంట్రల్ బ్యాంకులు (85 శాతం) భౌగోళిక-రాజకీయ ముప్పుల నుంచి రక్షణ కోసం బంగారాన్ని ఒక కవచంలా చూస్తున్నాయి.

మారుతున్న నిల్వ పద్ధతులు

బంగారాన్ని భద్రపరిచే విషయంలోనూ బ్యాంకులు రూట్ మార్చాయి. గతేడాదితో పోలిస్తే తమ సొంత దేశాల్లోనే బంగారు నిల్వలను పెంచుకున్న బ్యాంకుల సంఖ్య 5 శాతం నుంచి 9 శాతానికి పెరిగింది. అలాగే రిస్క్ తగ్గించుకోవడానికి వేర్వేరు విదేశీ లొకేషన్లలో బంగారాన్ని దాచే బ్యాంకుల సంఖ్య 2 శాత నుంచి 10 శాతానికి ఎగబాకింది. దేశీయ నిల్వలకు (49 శాతం) ప్రాధాన్యత పెరుగుతున్నప్పటికీ, గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులకు బ్రిటన్‌కు చెందిన 'బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్' ఇప్పటికీ హాట్ ఫేవరెట్‌గా నిలిచింది. బంగారం ఇప్పుడు కేవలం లాకర్‌లో పడి ఉండే లోహం కాదని, మారుతున్న ప్రపంచంలో పవర్ఫుల్ ఫైనాన్షియల్ టూల్ అని డబ్ల్యూజీసీ ఆసియా-పసిఫిక్ హెడ్ షావోకై ఫాన్ వెల్లడించారు.

Next Story