- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలు.. రూ. 16 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద
అంతర్జాతీయంగా అమెరికా, చైనా మధ్య టారిఫ్ తగ్గించేందుకు అవగాహన ఏర్పడటం కూడా మార్కెట్ల భారీ లాభాలకు కారణమయ్యాయి

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లు సోమవారం రికార్డు స్థాయిలో ర్యాలీ చేశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఒకే రోజు అత్యధిక లాభాలను సాధించాయి. గత వారాంతం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం, ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ మన మార్కెట్లలోకి విదేశీ ఇన్వెస్టర్లు నిధులను కొనసాగించడం కూడా మదుపర్ల సెంటిమెంట్‌ని బలపరిచింది. ఈ అంశానికి తోడు అంతర్జాతీయంగా అమెరికా, చైనా మధ్య టారిఫ్ తగ్గించేందుకు అవగాహన ఏర్పడటం కూడా మార్కెట్ల భారీ లాభాలకు కారణమయ్యాయి. దీనివల్లే సోమవారం ఉదయం మార్కెట్లు ప్రారంభంలోనే దాదాపు 1,500 పాయింట్ల మేర పుంజుకున్నాయి. ఆ తర్వాత భౌగోళిక రాజకీయ పరిణామాలు సద్దుమణుగుతున్నాయనే సంకేతాలు, గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో మన మార్కెట్లలోనూ అదే స్థాయి ర్యాలీ కొనసాగింది. ఓ దశలో సెన్సెక్స్ ఇండెక్స్ 3 వేల పాయింట్ల కంటే ఎక్కువ పెరిగింది. ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్లు గడిచిన నాలుగేళ్లలో తొలిసారి అతిపెద్ద సింగిల్-డే ర్యాలీ చేశాయని నిపుణులు తెలిపారు. నిఫ్టీ సైతం గతేడాది డిసెంబర్ తర్వాత 25 వేలకు పైన తాకింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 2975.43 పాయింట్లు ఎగసి 82,430 వద్ద, నిఫ్టీ 916.70 పాయింట్లు లాభపడి 24,924 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, ఎటర్నల్, టెక్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు 5 శాతానికి పైగా రాణించాయి. స్టాక్ మార్కెట్ల భారీ లాభాల కారణంగా సోమవారం మదుపర్ల సంపద రూ. 16 లక్షల కోట్లకు పైగా పెరిగింది. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 432 లక్షల కోట్లకు చేరుకుంది.






