SBI: క్యాషే రారాజు.. చలామణిలో రూ. 40 లక్షల కోట్లు

by S Gopi |

గడిచిన దశాబ్ద కాలంలో వ్యవస్థలో కరెన్సీ చలామణి 2013, మార్చిలో రూ. 11.8 లక్షల కోట్ల నుంచి 2016, మార్చి నాటికి రూ. 16.6 లక్షల కోట్లకు పెరిగాయి.

SBI: క్యాషే రారాజు.. చలామణిలో రూ. 40 లక్షల కోట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో డిజిటల్ చెల్లింపులు ఎంత వేగంగా పెరుగుతున్నప్పటికీ క్యాష్ ఇప్పటికీ రారాజుగానే కొనసాగుతోంది. తాజగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ పరిశోధనా విభాగం ఎకోరాప్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న కరెన్సీ రికార్డు స్థాయిలో రూ. 40 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది గతేడాదితో పోలిస్తే 11.1 శాతం పెరిగింది. అయితే, నగదు-జీడీపీ రేషియో 2021, మార్చిలో 14.4 శాతం ఉండగా, ప్రస్తుతం 11.2 శాతానికి తగ్గింది. ఇందుకు ప్రధానంగా దేశంలో డిజిటల్ చెల్లింపులు మొత్తం ఆర్థిక కార్యకలాపాల్లో అత్యధిక వాటాను సొంతం చేసుకోవడమేనని నివేదిక అభిప్రాయపడింది. గడిచిన దశాబ్ద కాలంలో వ్యవస్థలో కరెన్సీ చలామణి 2013, మార్చిలో రూ. 11.8 లక్షల కోట్ల నుంచి 2016, మార్చి నాటికి రూ. 16.6 లక్షల కోట్లకు పెరిగాయి. నోట్ల రద్దు తర్వాత 2017, మార్చిలో రూ. 13.4 లక్షల కోట్లకు తగ్గినప్పటికీ, కొవిడ్ మహమ్మారి ప్రభావం వల్ల 2021, మార్చి నాటికి ఏకంగా రూ. 28.5 లక్షల కోట్లకు చేరాయి. నగదు చలామణి పెరుగుతున్నప్పటికీ, కరెన్సీ-జీడీపీ రేషియ్లో 2022, మార్చిలో 13.7 శాతం, 2023లో 12.4 శాతం, 2024, మార్చిలో 11.9 శాతం, 2025, మార్చి నాటికి 11.26 శాతానికి తగ్గింది. ఆ తర్వాత 2026, జనవరి కల్లా ఇది 11-11.2 శాతానికి చేరిందని నివేదిక వివరించింది.

రికార్డు స్థాయిలో నగదు పెరగడానికి కఠినమైన పన్ను నిబంధనల అమలు, తక్కువ వడ్డీ రేట్లు, మారుతున్న కుటుంబాల ఖర్చు ధోరణి కారణమని నివేదిక అభిప్రాయపడింది. యూపీఐ లావాదేవీల వాల్యూమ్‌ల ఆధారంగా చిన్న విక్రేతలకు 2025, జూలైలో జారీ చేసిన దాదాపు 18,000 జీఎస్టీ నోటీసులు కర్ణాటక, పశ్చిమ బెంగాల్, కేరళలో ఏటీఎం విత్‌డ్రా పెరిగేందుకు దోహదపడ్డాయి. ఇది చిన్న వ్యాపారులు తిరిగి నగదు నిల్వకు మారడాన్ని సూచిస్తుంది. డిపాజిట్ల పెరుగుదల నిదానంగా ఉండటం, తక్కువ వడ్డీ రేట్లు కూడా ప్రజల్లో ముందుజాగ్రత్త నగదు పొదుపు ధోరణిని పెంచాయి.

Next Story