BYD India: ధరలు పెంచిన బీవైడీ ఇండియా

by S Gopi |

జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ పెంపు నిర్ణయం, మోడల్‌ను బట్టి రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉంటుంది.

BYD India: ధరలు పెంచిన బీవైడీ ఇండియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న చైనా కంపెనీ బీవైడీ ఇండియా తన ప్యాసింజర్ వాహనాల్లోని కొన్ని వేరియంట్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ పెంపు నిర్ణయం, మోడల్‌ను బట్టి రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉంటుంది. ఈ మార్పు బీవైడీ అటో 3, బీవైడీ సీలయన్ 7, బీవైడీ సీల్ మోడళ్లలోని ఎంపిక చేసిన వేరియంట్లకు వర్తిస్తుంది. అయితే అటో 3, ఈమ్యాక్స్ 7లోని కొన్ని వేరియంట్ల ధరలను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ధరల పెంపునకు ప్రధాన కారణంగా ముడి పదార్థాల వ్యయం పెరగడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అలాగే దేశంలో డీలర్ నెట్‌వర్క్ విస్తరణ, కొత్త సాంకేతికతలో కొనసాగుతున్న పెట్టుబడులేనని కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో కొన్ని వేరియంట్ల ధరలను సవరించడం తప్పనిసరి అయిందని బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల విభాగం అధిపతి రాజీవ్ చౌహాన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కార్లు, పునరుత్పాదక ఇంధన పరిష్కారాల తయారీలో ప్రముఖ సంస్థగా ఉన్న బీవైడీ, భారత మార్కెట్లో కూడా తన ఉనికిని వేగంగా విస్తరిస్తోంది.

Next Story