వారాంతం భారీ లాభాలు!

by Disha Web Desk 17 |
వారాంతం భారీ లాభాలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం భారీ లాభాలతో దూసుకెళ్లాయి. అంతకుముందు సెషన్‌లో ఊగిసలాటకు గురైన సూచీలు శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైంది. క్రమంగా ర్యాలీ అధిక లాభాలతో చివరి వరకు కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో పాటు విదేశీ మదుపర్లు భారత ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించడం కలిసొచ్చింది.

వాటితో పాటు అంతకుముందు కొన్ని సెషన్లలో బలహీనపడిన దిగ్గజ కంపెనీల షేర్లలో శుక్రవారం పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిగాయి. ముఖ్యంగా రిలయన్స్ సెన్సెక్స్ ఇండెక్స్‌లో అత్యధికంగా 2.79 శాతం పుంజుకుంది. హెచ్‌యూఎల్, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ వంటి దిగ్గజ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను పెంచింది.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 629.07 పాయింట్లు దూసుకెళ్లి 62,501 వద్ద, నిఫ్టీ 178.20 పాయింట్లు లాభపడి 18,499 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా, ఐటీ, ఎఫ్ఎంసీజీ, పీఈస్‌యూ బ్యాంక్, ఫార్మా, మెటల్ రంగాలు 1 శాతానికి పైగా పుంజుకున్నాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో రిలయన్స్, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్, హిందూస్తాన్ యూనిలీవర్, విప్రో, టెక్ మహీంద్రా, అల్ట్రా సిమెంట్, టాటా స్టీల్ కంపెనీల షేర్లు అధిక లాభాలను సాధించాయి. భారతీ ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ స్టాక్స్ మాత్రమే నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.58 వద్ద ఉంది.Next Story